విజయవాడ – దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అన్ని వర్గాల వారి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తుచేశారు. విగ్రహాలు పెట్టడం వలన పేదల ఆకలి తీరదని.. దళితులపై కపటి ప్రేమ చూపించే వారికి రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఏపీ ఒటర్లకు షర్మిల పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు.
ఏపీలో వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను చంపి, డోర్ డెలివరీ చేస్తున్నారని అన్నారు.. అరాచకాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. దళితులకు గుండు కొట్టించి అవమానిస్తున్నారని అన్నారు. వీటన్నింటినీ ప్రజలందరూ చూశారని అంటూ ఎస్సీలను వేధిస్తూ… అంబేద్కర్ విగ్రహాలు పెడితే ఏం ప్రయోజనమని ఏంటనీ జగన్ ను నిలదీశారు..
ఎస్సీ నిధులు మింగేశారు
దళితుల కోసం కేటాయించిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని షర్మిల విమర్శించారు. ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు, ఇతర సామాజికవర్గాలకు చెందిన అందరూ బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. దళితులపై కపట ప్రేమను చూపిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరం ప్రమాణం చేద్దామని… రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వని పార్టీలకు మద్దతు తెలపబోమని ప్రమాణం చేయాలని చెప్పారు. స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పార్టీలకు ఓటు వేయబోమని ప్రమాణం చేద్దామని అన్నారు.
వైఎస్ ఆర్ బిడ్డను కాబట్టే షర్మిలా రెడ్డి అంటున్నారు..
తన గురించి తప్పుగా మాట్లాడుతున్న వైసీపీ నేతలపై ఆమె మండిపడ్డారు. తాను వైఎస్సార్ కుమార్తెను అయినప్పుడు… ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తన కుమారుడికి తన తండ్రి రాజశేఖరరెడ్డి ఆయన తండ్రి పేరు వైఎస్ రాజారెడ్డి అని పెట్టుకున్నారని తెలిపారు. తనకు కితాబు ఇస్తే తన విలువ ఎక్కువ కాదని, ఎవరో కితాబు ఇవ్వకపోతే తన విలువ తక్కువ కాదని అన్నారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించేందుకే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు.
నిజాలు మాట్లాడితే విలువలు పెరుగుతాయి..
సొంత మనిషిగా భావించిన కొండా రాఘవరెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. పాదయాత్ర చేస్తానని తాను భారతిని అడిగానని ఆయన అన్నారని… మీ దేవుడి మీద, మీ బిడ్డల మీద ప్రమాణం చేసి తాను అడిగానని చెప్పగలరా? అని ప్రశ్నించారు. నిజాలు మాట్లాడితే మీ విలువ పెరుగుతుంది కానీ, ఇలాంటి అభాండాలు వేస్తే మీ విలువ పెరగదని అన్నారు. అక్రమంగా సంపాదించుకోవడానికి తన భర్తతో కలిసి జగన్ వద్దకు వెళ్లానని అంటున్నారని ఈరోజు వరకు ఏదీ ఆశించి తన అన్న వద్దకు వెళ్లలేదని చెప్పారు. దానికి సాక్ష్యం తన తల్లి అని దమ్ముంటే వెళ్లి ఆమెను అడగాలని అన్నారు.