తిరుపతి, ప్రభన్యూస్ బ్యూరో (రాయలసీమ) : 75 ఏళ్ల భారత ఆజాదీ మహోత్సవంలో భాగంగా శ్రీహరికోట అంతరిక్షకేంద్రం విలక్షణమైన ఆజాదీశాట్ అనే సమాచార ఉపగ్రహ ప్రయోగానికి వేదిక కానున్నది. ఈ ప్రయోగంలో దేశవ్యాప్తంగా ఎంపికైన 75 పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్ధినులు విజ్ఞానం కీలకపాత్ర పోషించడం చెప్పుకోదగిన విశేషం. ఇందులో రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన ఏడు పాఠశాలల విద్యార్ధులు పాలుపంచుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు నిండుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అజాద్ అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ జాతీయస్దాయి వ్యవస్ధలు పలురకాలుగా ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అంతరిక్ష సంబంధిత విజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తున్న స్పేస్ కిడ్స్ ఇండియా ఒక విలక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమెన్ ఇన్ స్పేస్ అనే ఐక్యరాజ్యసమితి నిర్దేశిత ధీమ్‌కు అనుగుణంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేధ్‌మెటిక్స్ (స్టెమ్) విభాగాలలో మహిళను ప్రోత్సహించడానికి అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాన్ని ఎంపిక చేసుకుంది. ఇందుకు భారత అంతరిక్ష పరిశోథనాసంస్ధ (ఇస్రో) అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి ముందుకువచ్చింది. ఇందులో దేశవ్యాప్తంగా 75 ప్రభుత్వ విద్యాసంస్ధల లో విజ్ఞానశాస్త్రాలను అభ్యసించే 750 మంది విద్యార్దినుల నైపుణ్య విజ్ఞానం భాగస్వామ్య మవుతోంది. ఈ సందర్బంగా ఆజాదీశాట్ పేరుతో రూపొందించిన 8 కిలోల ఉపగ్రహం రూపకల్పన జరిగింది. ఈ ఉపగ్రహాన్ని 500 కిలోల కన్నా తక్కువ బరువున్న ఉపగ్రహాలను తీసుకువెళ్లే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ ఎస్ ఎల్ వి) ద్వారా అంతరిక్షంలో ప్రయోగించడానికి రంగం సిద్దమైంది. ఈ విషయాలను వెల్లడించిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్‌స్పేస్) అజాదీశాట్ లో 75 ఫెవ్టూె ప్రయోగ విజ్ఞానం, సోలార్ ప్యానల్ ద్వారా పనిచేసే సెల్ఫి కెమెరాల వ్యవస్ధలు ఉంటాయని, ఆరునెలలపాటు అంతరిక్షంలో ఉండే ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ సంబంధిత అవసరాలకు ఉపకరిస్తుందని ఇన్‌స్పేస్ తెలియచేస్తోంది. ఈ ప్రయోగంలో వినియోగించే ఆజాదీశాట్ ద్వారా 75 పాఠశాలలకు చెందిన విద్యార్ధినుల విజ్ఞానాన్ని పొందుపరిచిన 75 పేలోడ్స్ అంతరిక్ష పరిశోథనల్లో కీలకపాత్ర పోషించనున్నదని చెప్పవచ్చును.
7 తెలుగుపాఠశాలలకు దక్కిన గౌరవం..
దేశ చరిత్రలోనే తొలిసారిగా జరగనున్న ఈ విలక్షణ ప్రయోగంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 75 ప్రభుత్వ పాఠశాల ను నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో ఎంపిక చేసారు. అందులో ప్రతిపాఠశాల నుంచి 8వ తరగతి నుంచి 12వ తరగతి చదివే పదేసిమంది బాలికలను ఎంపిక చేసారు. పాఠశాలల్లో రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన ఏడు పాఠశాలల విద్యార్ధినులు భాగస్వాములవుతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు పాఠశాలలు, తెలంగాణకు చెందిన మూడు పాఠశాలలకు చెందిన 70 మంది బాలికలు అజాదీశాట్ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నారు. అధికారిక సమాచారం ప్రకారం తిరుపతి జిల్లా నారాయణవనంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, అనంతపురం జిల్లా కురుగుంటలోని ఆంధ్రప్రదేశ్ సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాల, తూర్పుగోదావరి జిల్లా వీరలంకపల్లెలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, శ్రీకాకుళం జిల్లా జెఎర్రుపాలెం ప్రభుత్వ పాఠశాల, నిజమాబాద్ జిల్లా గురజాకుంట ప్రభుత్వ పాఠశాల, సికిందరాబాద్‌లోని సెయింట్ ప్రాన్సిస్ బాలికల పాఠశాల, ఆర్మూరు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, హైదరాబాద్ వెంగళరావునగర్ కు చెందిన ప్రభుత్వ ఉన్నతపాఠశాలు 75 పాఠశాలల జాబితాలో ఉన్నాయి. ఇక శాటిలైట్ రూపకల్పలో స్పేస్ కిడ్స్ ఇండియా ఇంజనీరింగ్ విద్యార్ధుల్లో తిరుపతికి చెందిన సాయి, రఘుపతి, హైదరాబాద్‌కు చెందిన కీర్తన్ ఉన్నారని సంబంధిత అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ ప్రయోగానికి శ్రీహరికోట రాకేట్ ప్రయోగకేంద్రంలో అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రాథమిక పరిశీలనలు, పరీక్షలు పూర్తయిన తర్వాత ఆజాదీశాట్ ప్రయోగించే తేదిని షార్ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సివుందని తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.