Friday, September 6, 2024

AP: ద‌వళేశ్వ‌రం వ‌ద్ద శాంత గోదావరి… 175 గేట్లు ఎత్తివేత …

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – రాజ‌మండ్రి – ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 13.70 అడుగులకు వరద నీటి మట్టం తగ్గింది. బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం నుండి విజ్జేశ్వరం వరకు బ్యారేజ్‌కు ఉన్న 175 గేట్లను ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో నుండి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం తగ్గడంతో ఈ సాయంత్రానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉంది. 11.7 అడుగులకు నీటిమట్టం తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉంటుంది. గోదావరి వరద నీటిమట్టం తగ్గడంతో బ్యారేజ్ దిగువన ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు, కాజ్‌వేలపై నీటి ప్రవాహం తగ్గుతోంది.

భారీ వ‌ర్షాల‌తో గిరిజ‌నులు దిగ్భంధం…
మరో వైపు అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఇళ్లకే పరిమితమ‌య్యారు. రోడ్లు భారీగా కోతలకు గురవ్వడంతో ఊరు దాటి బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో నానా ఇబ్బందులు పడుతున్నారు ఏజెన్సీ వాసులు. ముంచంగి పుట్టు, జంగం పుట్టు, గుల్లేలుతో పాటు ఒడిశా సరిహద్దు గ్రామాలకు వరదల ప్రభావం పెరుగుతూనే ఉంది. వారాంతపు సంతలకు వెళ్లే అవకాశం లేక తినడానికి సరిపడా సరుకులు లేక అల్లాడిపోతున్నారు.

- Advertisement -

అధికారులూ కనీసం పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు.. ఏజెన్సీ వాసులు తప్పని పరిస్థితుల్లో ప్రమాదకర వాగులు, గెడ్డలు దాటుకుంటూ ప్రయాణిస్తున్నారు. వరద ఉదృతి భయంకరంగా ఉన్నా నిత్యావసర సరుకుల కోసం ప్రాణాలకు తెగించి మరీ గెడ్డలు దాటి మైదాన ప్రాంతాలకు చేరుకుంటున్నారు. బుంగా పుట్టు, లక్ష్మి పురం, ముంచంగి పుట్టు పరిధిలో సుమారు 70 గ్రామాలు చిక్కుకున్నాయి. జనజీవన స్రవంతి స్తంభించి పోవడంతో కొండ ప్రాంతాలలోనే మగ్గిపోయే పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement