Tuesday, November 26, 2024

ఆ బుల్లెట్ ఎక్కడిది?: పరిటాల సిద్థార్థ్‌కి బిగుస్తున్న ఉచ్చు!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్‌తో పట్టుబడిన ఏపీ మాజీ మంత్రి పరిటాల రవీంద్ర చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్‌కి ఉచ్చు బిగుస్తోంది. సిద్ధార్థ్ బ్యాగులో దొరికిన బుల్లెట్ లైసెన్స్‌డ్ గన్‌ది కాదని తేలింది. సాయుధ బలగాలు వినియోగించే 5.56 క్యాలిబర్ బుల్లెట్‌గా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల కిందట శ్రీనగర్ వెళ్లేందుకు బయల్దేరిన పరిటాల సిద్ధార్థ్ బ్యాగును తనిఖీ చేస్తుండగా బుల్లెట్ లభ్యమైంది. దీంతో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్ట్ పోలీసులు పరిటాల సిద్ధార్థ్‌కి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు.

ఈ నేపథ్యంలో శనివారం ఎయిర్‌పోర్ట్ పోలీసుల ఎదుట పరిటాల సిద్ధార్థ్ విచారణకు హాజరయ్యారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్, ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ విజయ్ కుమార్ బుల్లెట్ విషయమై సిద్ధార్థ్‌ను విచారించినట్లు తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సిద్ధార్థ్ సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు రెండు గంటలపాటు పోలీసులు విచారణ జరిపారు. సిద్ధార్థ్ బ్యాగులో దొరికిన బుల్లెట్ లైసెన్స్‌డ్ గన్‌ది కాదని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

సిద్ధార్థ్ వద్ద పాయింట్ 32 క్యాలిబర్ గన్‌ లైసెన్స్ ఉందని.. కానీ బుల్లెట్ 5.56 క్యాలిబర్ కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాగులో దొరికిన బుల్లెట్ సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్స్‌ తూటాగా చెబుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇండో టిబెటిన్ బోర్డర్‌ కానిస్టేబుల్ తుపాకీ బుల్లెట్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుల్లెట్ లైసెన్స్‌డ్ గన్‌ది కాకపోవడంతో పరిటాల సిద్ధార్థ్‌పై పోలీసులు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరోమారు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చి పంపించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండిః బ్రేక్ టైమ్ లో ‘భీమ్లా నాయక్’.. గన్​తో ఏం చేశాడంటే..?

Advertisement

తాజా వార్తలు

Advertisement