నెల్లూరు, (ప్రభ న్యూస్) : నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామంలో నివాసముండే మాణికల పోలమ్మ, చిన్నసూలమయ్య దంపతులకు ముగ్గురు పిల్లలు. దంపతులిరువురు చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద పనిచేసుకుంటూ ఆ ప్రాంగణంలోనే జీవిస్తున్నారు. ఆదివారం సాయంత్రం దేవస్థానం ముందు పోలమ్మ పిల్లలు ముగ్గురు ఆడుకుంటుండగా, ఇద్దరు గుర్తు తెలియని మహిళలు స్కూటర్‌లో వచ్చి అక్కడ ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని పండ్లు కొనిస్తామని ఆశ చూపి కిడ్నాప్ చేసుకువెళ్లారు. కొంత సమయం తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించి ఆరా తీయగా, ఇద్దరు మహిళలు చిన్నారిని తీసుకుని వెళ్లినట్లు తెలుసుకుని ఇందుకూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్పీ విజయరావు వెంకటాచలం మండలం సీఐ , కృష్ణపట్నం సీఐల నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంగపట్నం గ్రామం నుండి నెల్లూరు నగరం వరకు అన్ని సీసీ కెమెరా పుటేజ్‌లను సేకరించి కిడ్నాప్‌కు పాల్పడిన మహిళల స్కూటర్‌ను గుర్తించారు.
నగరంలోని జేమ్స్ గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉండే తల్లి, కుమార్తెలు నామతాటి ప్రమీల, నామతాటి శ్వేతలే కిడ్నాపర్లుగా గుర్తించి పోలీసులు సోమవారం ఉదయం వారిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శ్రామికనగర్ ప్రాంతంలో ఉన్న షేక్ జహీరాబి అనే మహిళకు రూ.52 వేలకు విక్రయించి రూ.32 వేలను అడ్వాన్సుగా తీసుకున్నామని విచారణలో వెల్లడించారు. దీంతో పోలీసులు జహీరాబిని కూడా అదుపులోకి తీసుకుని చిన్నారిని సంరక్షించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.32 వేలు నగదు, కిడ్నాప్‌కు ఉపయోగించిన స్కూటర్‌ను పోలీసులు సీజ్ చేశారు. తమ బిడ్డను రక్షించి అప్పగించిన ఎస్పీ విజయరావు, పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ విజయరావు చిన్నారికి, వారి తల్లిదండ్రులకు దుస్తులు, పండ్లు బహుమతిగా ఇచ్చారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital