Tuesday, November 19, 2024

రుణాల పరిమితి పెంచాలని పలు రాష్ట్రాల విజ్ఞప్తి..

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పొందుపర్చిన అన్ని హామీలను అమలు చేయడానికి తగిన నిధులను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రాన్ని కోరారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిర్వహించిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ అవసరాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. సమావేశం అనంతరం విడిగా కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి అందజేసే నిధులను 90 :10 నిష్పత్తిలో ఇవ్వాలని కోరారు. అలాగే కౌలు రైతులకు ప్రయోజనాలు కలిగే కొత్త పథకానికి రూపకల్పన చేయాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రాల తమ తమ అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటునివ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని, నిధుల విడుదలలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ కరువు నివారణ పథకాలకు నిధులను కేటాయించాలని అభ్యర్థించారు. షెడ్యూలు 12లో ఉన్న సంస్థలన్నింటికీ నిధులు కేటాయించాలని కోరారు.

కరోనా అనంతరం ఏర్పడ్డ ఆర్థిక లోటు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల రుణ పరిమితి పెంపు, వెంట వెంటనే వివిధ మార్గాలు రుణాలు అందజేయడం, మూలధన వ్యయం కోసం ప్రత్యేక సహాయం వంటి చర్యలతో రాష్ట్రాలను ఆదుకున్న కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్రాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఇదే మాదిరిగా 2022-23 కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రుణ పరిమితి సహా ప్రత్యేక ఆర్థిక సహాయం అందచేయాలంటూ పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. వీటితో పాటు రాష్ట్రాలు కేంద్రానికి అనేక సూచనలు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు పాల్గొని తమ సూచనలు, అవసరాలను కేంద్రానికి తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement