నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హెల్త్ సీరియస్ అయ్యింది. 47 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. శుక్రవారం ఓ కుటుంబం ఇంట్లోనే ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. ఈ క్రమంలో సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి చెన్నైలోని అపోలోకి తరలిస్తున్నారు. నెల్లూరులో ఆయనను మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. ఇవ్వాల మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆమంచర్ల గ్రామంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని కోటంరెడ్డి నిర్వహించారు.
కాగా, ఆమంచర్ల పర్యటనలో ఉన్నప్పుడు స్వల్పంగా ఛాతిలో నొప్పి రావడంతో కోటంరెడ్డి పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆయన్ను నిలువరించి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో ఆయన నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు సమీపంలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. విశ్రాంతి తీసుకునే క్రమంలో ఛాతి నొప్పి అధికం కావడంతో వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. అయితే డాక్టర్లు మాత్రం కోటంరెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతన్నారు.