టంగుటూరు (ప్రభ న్యూస్): మట్టి అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు కన్నెర్ర చేశారు. ఇవ్వాల రాత్రి (శనివారం) తహసీల్దార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఎర్ర మట్టి తవ్వకాలు జరిపే ప్రదేశానికి వెళ్లి టిప్పర్, జేసీబీ, ట్రాక్టర్‌ని సీజ్ చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొణిజేడులో జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ.. కొండ ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు చట్ట రీత్యా నేరం అన్నారు. ఎర్ర మట్టి తవ్వకాలు జరిపితే ఎంతటివారైనా సహించేది లేదన్నారు.
ఈ క్రమంలో మట్టి అక్రమ తరలింపుదారులకు, తహసీల్దార్ కు స్వల్ప వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మండలంలోని కందులూరు, మర్లపాడు, కొణిజేడు ప్రాంతాల్లో అక్రమంగా ఎర్ర మట్టి తరలిస్తున్న విషయాన్ని తహసీల్దార్ సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం రావాల్సిన చోట గండికొట్టి అక్రమంగా మట్టి తరలించుకు వెళ్లాలని చూస్తే ఊరుకోం అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. మట్టి తరలిస్తుండగా సీజ్ చేసిన టిప్పర్, జేసీబీ, ట్రాక్టర్ ని ఒంగోలు మైనింగ్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంట పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.