జిమ్‌లు, క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ ఫూల్స్ బంద్
బస్సులు, సినిమా హాళ్లు 50శాతం సామర్థ్యంతోనే
అందుబాటులో 11,430 రెమిడెసివర్ ఇంజక్షన్లు
ఇకనుంచి పూర్తిస్థాయిలో ఆక్సిజన్ ఆడిట్
చిత్తూరు జిల్లాలో మినీ లాకడౌేన్ ఆంక్షలు
కంటైన్మెంట్ జోన్‌గా తిరుపతి
పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ కట్టడి
మహానగరాల్లో మధ్యాహ్నం 2 తర్వాత దుకాణాలు బంద్
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ
మినీ కంటైన్మెంట్ జోన్లు ప్రకటించుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలు
మే 4 తర్వాత మరిన్ని కఠిన ఆంక్షలపై కసరత్తు
అమరావతి, : రాష్ట్రంలో రోజురోజుకు ఉధృతమవుతున్న కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నమవు తోంది. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఆంక్షలను విధిం చింది. అదేవిధంగా మే మొదటి వారం తరువాత రాష్ట్రవ్యాప్తంగా మినీ లాక్‌డౌన్‌ను అమలుపరిచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఆ దిశగానే ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఆయా జిల్లాలలో స్థానిక పరిస్థి తులను దృష్టి లో ఉంచుకుని అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు స్పష్ట మైన ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటికే గుంటూరు తదితర జిల్లాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 7 గంటల వరకు దుకాణాలను మూసి వేస్తున్నారు. అదేవిధంగా వ్యాపార సంస్థ లు కూడా స్వచ్ఛందంగా ముందు కొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. తాజాగా తిరుపతి, విజయ వాడ వంటి మహానగరాల్లో కూడా మంగళవారం నుంచి కొత్త ఆంక్షలు అమలు చేయబోతున్నారు. ఉ. 7 గంటల నుంచి మ. 2 గంటల వరకే దుకాణాలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతులిచ్చారు. ఇతర వ్యాపార సంస్థ లకు అవే నిబంధనలు వర్తించనున్నాయి. గుంటూరు జిల్లాలో తెనాలి, నర్సారావుపేట తదితర పట్టణాల్లో కూడా మధ్యాహ్నం తరువాత వ్యాపార సంస్థ లను మూసివేస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు, మదనపల్లి, నెల్లూరు జిల్లాలోని కావలి, గూడూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో కూడా వ్యాపారులు మధ్యాహ్నం తరువాత తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు రోజుల క్రితం నైట్ కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాలలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆ నిబంధనలు కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండడం, 50 మందికి పైగా మృతి చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుండే పొంచి ఉన్న పెను ప్రమాదం నుంచి రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించేందుకు దశలవారీగా కఠిన ఆంక్షలను అమలు చేసుకుంటూ వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మే మొదటివారం తరువాత రాష్ట్రవ్యాప్తంగా మినీ లాక్‌డౌన్‌ను విధించాలని భావిస్తోంది.
జిల్లాల లో.. ఎక్కడికక్కడ ఆంక్షలు
రాష్ట్రంలోని 13 జిల్లాలలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. పదిరోజుల క్రితం వరకు మూడునాలుగు జిల్లాల్లోనే కేసులు ఉదృతంగా నమోదవుతూ వచ్చాయి. తాజాగా ప్రతి జిల్లాలోను వారానికి రెండుమూడు రోజులు వెయ్యి మార్క్ దాటి కేసులు నమోదవుతున్నాయి. సోమవారం నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 1597 కేసులు నమోదు కాగా.. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో 1500కు పైగా, నాలుగు రోజుల క్రితం తిరుపతిలో అదే సంఖ్యలో కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అలాగే గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నంలో కూడా 1000 నుంచి 1500 వరకు రోజుకు కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా పట్టణ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాలలో మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆయా జిల్లాల పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో కూడా ఆంక్షలను అమలు చేస్తున్నారు. రానున్న రెండుమూడు రోజుల్లో కేసుల సంఖ్య అత్యధికంగా నమోదవుతున్న జిల్లాలలో కూడా ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మే 4 తరువాత.. మరింత కఠిన ఆంక్షలు
ఏప్రిల్ మాసం ఆరంభంలో రాష్ట్రంలో కేవలం కరోనా కేసులు 100 నుంచి 1000 లోపే నమోదవుతూ వచ్చాయి. క్రమేనా ఆ కేసుల సంఖ్య 10 వేలకు చేరుకుంది. రానున్న రోజుల్లో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. దీన్ని దృష్టి లో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మే 4 తరువాత రాష్ట్రవ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. కర్నాటక అయితే మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మే 2వ తేది తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రంలో మరిన్ని కఠిన ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే.. పెరుగుతున్న కోవిడ్ మరణాలు
ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తోంది. మొదటిదశ కోవిడ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ప్రమాదకరం వైపు దూసుకెళ్తున్నాయి. గత పదిరోజుల్లోనే 500 మందికి పైగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌తో చనిపోయారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో మరణిస్తున్న బాధితుల్లో అత్యధిక శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే చనిపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రైవేట్ వైద్యశాలల్లోనే ఎక్కువ శాతం మంది ఎందుకు చనిపోతున్నారో ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆక్సిజన్, బెడ్ల కొరత కూడా ప్రైవేట్ వైద్యశాలల్లోనే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలో బెడ్ల ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారిక ప్రకటన చేస్తోంది. ఆదివారం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో 1350కు పైగా బెడ్లు ఖాళీగా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే అదేరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లు లేక గంటల తరబడి వేచి ఉండి సమయానికి వైద్యం అందక పలువురు మృతి కూడా చెందారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అసలు ప్రైవేట్ వైద్యశాలలో ఏం జరుగుతుందో కరోనా రోగులకు ఏవిధమైన వైద్యాన్ని అందిస్తున్నారో..? అసలు బాధితుల నుంచి ప్రభుత్వం సూచించిన ఫీజులనే వసూలు చేస్తున్నారా అనే అంశంపై కూడా నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.