అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇక నుండి పాఠశాల విద్యలోనూ సెమిస్టర్ విధానం అమలుకానున్నది. ఒకటి నుండి తొమ్మిదో తరగతి వరకు 2023-2024 ఏడాది నుంచి, పదో తరగతికి 2024-2025 ఏడాది నుండి సెమిస్టర్ విధానం అమలుకానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర విద్యా విధానంలో పలు ప్రగతిశీల మార్పులు తీసుకువస్తున్నామని, అందులో భాగంగానే సెమిస్టర్ విధానాన్ని కూడా అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఎన్‌సిఇఆర్‌టి, ఇతర రాష్ట్ర విద్యా బోర్డులకు చెందిన కరిక్యులమ్, సిలబస్, టెక్ట్‌బుక్స్‌పై రాష్ట్ర విద్యా పరిశోధనా మరియు శిక్షణా సంస్థ (ఎస్‌సిఇఆర్‌టి) సమగ్రం గా అధ్యయనం చేసి సెమిస్టర్ విధానం కోసం ఒకటి నుండి ఎనిమిదో తరగతులకు పాఠ్యపుస్తకాలను రూపొందించిందని తెలిపింది. విద్యాశాఖ ఉత్తర్వుులు ప్రకారం సెమిస్టర్ విధానం అమలుకు విద్యాధికారులంతా చొరవ చూపాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.