తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో సెల్ఫీల సందడి ఎక్కువవుతోంది. ప్రతీ రోజూ షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర కొనసాగించే క్రమంలో సెల్ఫీలకి టైము కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతోంది. పలు చోట్ల గుమి కూడిన జనం సెల్ఫీలకు పోటీ పడటంతో లోకేష్ ఎత్తైన వేదిక పై నిలబడి తానే సెల్ఫీ తీసి ఇస్తున్నా.. వ్యక్తిగతంగా షేక్ హ్యాండిచ్చి ఓ ఫోటో దిగాలని తహతహలాడుతున్నారు. దీంతో నారా లోకేష్‌తో ఫోటోలు, సెల్ఫీలు దిగాలనుకునేవారికి క్యాంప్ సైట్ వద్దకి రావాలని సిబ్బంది సూచించారు.
సిబ్బంది వారు దిగిన ఫోటోలను వారికి నేరుగా పంపే ఏర్పాటు చేశారు. ఫలితంగా ఉదయం అయ్యేసరికి లోకేష్ విడిది కేంద్రం వద్దకు సెల్ఫీల కోసం జనం క్యూ కడుతున్నారు. నారా లోకేష్ నిద్రలేచే సరికి విడిది కేంద్రం వద్ద సెల్ఫీల సందడి ఆరంభం అవుతోంది. రోజుకి వెయ్యి మంది వరకూ సెల్ఫీలు దిగుతున్నారు. విడిది కేంద్రం వద్ద నారా లోకేష్‌తో సెల్ఫీలు దిగేవారితో అక్కడ కోలాహలం నెలకొంటోంది. విడిది కేంద్రం వద్ద ఆయనను కలవడానికి వచ్చిన వర్గాలతో సమావేశమై పాదయాత్ర ప్రణాళికతో పూర్తి చేయడానికి ఈ సెల్ఫీల సందడి ఆటంకం అవుతోంది.