అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రాంతాలకు వెళ్లి సెల్ఫీలు తీసి వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతుంది. ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటన లో భాగంగా ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పేదలకోసం నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయానికి వెళ్లి సెల్పీ దిగారు. అదే ఫోటోను ట్విట్టర్‌చేసి ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబును అనుసరిస్తూ ఆయా ప్రాంతాల్లో సెల్ఫీ ఫోటోలు తీసి జిల్లాలోని వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై గతంలోనే సీరియస్‌గా కౌంటర్ ఇచ్చిన వైసీపీ తాజాగా నాడు-నేడు కార్యక్రమాలను వేదికగా చేసుకుని టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్‌కు సరైన కౌంటర్ ఇచ్చి ప్రజలకు తమ సత్తాను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆదిశగానే ముఖ్యమం త్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గత రెండు మూడు రోజులుగా తమను కలిసిన పార్టీ ముఖ్య నేతలతో ఇదే అంశంపై చర్చించి గడచిన నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తం గా నాడు-నేడు పథకం ద్వారా నిర్మించిన భవనాలకు సంబంధించిన ఫోటోలను తీసి ప్రజలకు వివరించాలని సూచిం చినట్లు తెలిసింది. ప్రజల వద్దకు వెళ్లే సందర్భంలో ఆయా ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పక్కా సమాచారంతో వెళ్లి వారికి సమగ్ర సమాచారంతో వివరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది. ప్రత్యేకించి సోషల్ మీడియా వేదికగా చేసుకుని సెల్ఫీ ఛాలెంజ్ అటాక్ ప్రక్రియను మరింత దూకుడుగా తీసుకెళ్లాలని యోచిస్తుంది.
జిల్లాల్లోనూ పెరుగుతున్న సెల్పీ ఛాలెంజ్‌లు
2014 నుండి 2019 వరకూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. ఆసమయంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పథకాల ద్వారా పలు నిర్మాణ పనులను నాటి ప్రభుత్వం చేపట్టింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పనులు పూర్తికాలేదు. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అందుకు కారణాలు ఏమైనప్పటికీ తాము చేసిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని చంద్రబాబు తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ముఖ్య నేతలు సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుతున్నారు. ఆయా ప్రాంతాల్లో సెల్ఫీ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో కూడా పోస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జగన్ సీరియస్‌గా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తుంది. గడచిన నాలుగేళ్లలో లోటుబడ్జెట్‌లోనూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ నవరత్నాల ద్వారా ప్రజలకు నిరంతరం సంక్షేమ ఫలాలతోపాటు ఆయా ప్రాంతాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న అంతే వేగంగా ఆపనులను ప్రారంభించి జాతికి అంకితం కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి నాడు-నేడు కార్యక్రమం ద్వారా గతంలో ఉన్న పాఠశాల భవనాలను కోట్లాది రూపాయలు వెచ్చించి జగన్ సర్కార్ ఆధునీకరించింది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా వాటికి అన్ని హంగులు కల్పించింది. అదే తరహాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయా ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు, రైతులకు అవసరమైన ఆర్బీకేలు వేల సంఖ్యలో నిర్మిస్తూ అతి తక్కువ సమయంలోనే వాటిని పూర్తిచేస్తుంది. వీటన్నింటినీ జిల్లా స్థాయిలో ఛాలెంజ్ చేస్తున్న టీడీపీ నేతలకు కళ్లకు కట్టినట్లుగా చూపించి వారినోటికి తాళాలు వేయాలని అధికార పార్టీ యోచిస్తుంది. ఇదే సందర్భంలో అందుకు సంబంధించిన అభివృద్ధి వివరాలను ప్రజలకు కూడా పెద్ద ఎత్తున వివరించి టీడీపీని తప్పుడు ప్రచారమని ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించింది.
సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారానికి ప్రణాళికలు
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ జోరు పెంచబోతున్నారు. అందుకోసం ఇప్పటి నుండే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను అప్పటికప్పుడే తిప్పికొట్టేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే సెల్ఫీ ఛాలెంజ్‌ను సవాల్‌గా తీసుకుని తెలుగుదేశంది తప్పుడు ప్రచారమని రుజువుచేసేలా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించేందుకు సిద్దమౌతుంది. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గత ఏడాది మే 11వ తేదీ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ యోచిస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని అందుకు అవసరమైన ప్రణాళిలకను సిద్ధంచేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్య నేతలతో జరిగిన వివిధ సమావేశాల్లో సైతం జగన్ సూచిస్తూ వస్తున్నారు.