హైదరాబాద్ నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న లెక్కల్లో చూపని డబ్బుని కర్నూలులో పట్టకున్నారు. కర్నూలు సమీపంలోని శనివారం సాయంత్రం పంచలిoగాల రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేపట్టిన సెబి పోలీసులకు ఈ నగదు పట్టుబడింది. సెబి సిఐ మంజుల, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ సిబ్బంది చేపట్టిన వాహన తనిఖీల్లో హైదరాబాద్ నుండి తమిళనాడు రాష్ట్రంలోని మదురైకి వెళ్తున్న ఎపి 39 టి డి 4467 నంబరు గల ప్రైవేటు స్లీపర్ బస్సులో 75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడు రాష్ట్రం తిరుపూరుకు చెందిన సతీష్ బాల కృష్ణన్ (30) తన బ్యాగులో 75 లక్షల నగదు పెట్టుకొని ఉండగా చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా గుర్తించారు. ఈ నగదుకు సంభందించిన ఎలాంటి ఆధారాలు చూపలేదు. తాను ఈ నగదును హైదరాబద్ నుండి తిరుపూర్ కు స్థలం కొనుగోలుకు తీసుకెళుతున్నట్లు చెప్పాడు. తదుపరి విచారణ నిమిత్తం కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ కు పంపించినట్టు సీఐ మంజుల తెలిపారు.