తెలుగు రాష్ట్రాల్లో భారీగా బంగారం పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో దాదాపు తొమ్మిది కేజీలకు పైగా స్మగ్లింగ్ బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద 2.314 కిలోల స్మిగ్లింగ్ బంగారు కడ్డీలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.1.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి కోల్‌కతా నుంచి ఈ స్మగ్లింగ్ బంగారాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లోనూ 7.396 కేజీల బంగారం పట్టుబడింది. చెన్నై మెయిల్ (హౌరా నుంచి చెన్నై) ద్వారా కోల్‌కతా నుంచి శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఒక వ్యక్తి వద్ద బంగారాన్ని అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని బ్యాగును క్షుణ్ణంగా వెతకగా.. ట్రాలీ బ్యాగ్ లోపలి జిప్ లైనింగ్ జేబులో ఈ బంగారం బయటపడింది. స్మగ్లింగ్ చేసిన ఈ బంగారం విలువ రూ.4.21 కోట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి కోల్‌కతాలోని బార్‌లలో కరిగించి/రీకాస్ట్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. రెండు చోట్ల దాదాపు ఐదున్నర కోట్ల విలువ చేసే బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.