తడ, ప్రభన్యూస్ : ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన తడ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. విశాఖ నుండి చెన్నైకు ఆర్టీసీ బస్సులో 24 కిలోల గంజాయిని తరలిస్తున్న చెన్నై గంజాయి ముఠా సభ్యులను సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెబ్ అడిషనల్ ఎస్పీ జానకిరామన్‌తో పాటు సెబ్ సీఐ ఆర్‌యువీఎస్ ప్రసాద్, సిబ్బంది భీములవారిపాళెం సెబ్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 24 కిలోల గంజాయిని చెన్నైకి తీసుకువెళుతున్న గంజాయి ముఠా సురేష్, నటరాజన్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సెబ్ అడిషనల్ ఎస్పీ జానకిరామన్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ గంజాయి రవాణాపై పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే తడ మండలం భీములవారిపాళెం సెబ్ తనిఖీ కేంద్రం వద్ద ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించామని తమిళనాడులోని దిండిఖల్‌కు చెందిన సురేష్, నటరాజన్‌లు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు.
వీరు విశాఖపట్నంలో 24 కేజీల గంజాయిని కొనుగోలు చేసి రెండు కేజీల చొప్పున ప్యాకెట్లను సిద్దం చేసి విజయవాడకు చేరుకున్నారని తెలిపారు. విజయవాడ నుంచి నెల్లూరుకు చేరుకుని అక్కడి నుంచి చెన్నైకు ఆర్టీసీ బస్సులో వెళుతున్న క్రమంలో సెబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌యువీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో బస్సును తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఆ బస్సులో అనుమానాస్పదంగా ఉన్న రెండు బ్యాగులను గుర్తించి పరిశీలించగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి వాటిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను కోర్టుకు హాజరు పరుచనున్నట్లు ఆయన తెలియజేశారు. సెబ్ అడిషనల్ ఎస్పీ వెంట సెబ్ సిబ్బంది వి రఘు, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్‌లు ఉన్నారు.