Saturday, November 23, 2024

AP | గ్రూపు-2 పరీక్షలకు భద్రత కట్టుదిట్టం.. 144 సెక్షన్‌ అమలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగే ఏపీపీఎస్పీ గ్రూపు-2 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గ్రూప్‌-2 పోస్టులకు మొత్తం 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా 1327 పరీక్షా కేంద్రాల్లో ఈనెల 25వ తేది ఆదివారం స్క్రీనింగ్‌ రాత పరీక్ష జరుగనుంది. ఇందుకోసం పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. మొత్తం 3971 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా ఆయా జిల్లాల ఎస్పీలు పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

దాదాపు అన్ని పరీక్షా కేంద్రాలు నిఘా నీడలోకి వెళ్ళిపోయాయి. బందోబస్తులో భాగంగా ఆయా పరీక్ష కేంద్రాలపై సీసీ కెమేరాల పర్యవేక్షణ కొనసాగుతుంది. ఉదయం 10.30.గం.ల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు సక్రమంగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణ కోసం 24 మంది ఐఏఎస్‌ అధికారులు, 450 మంది రూట్‌ అధికారులు,1330 మంది లైజనింగ్‌ అధికారులను నియమించారు. ఇక కేంద్రాల్లో 24,142 మంది ఇన్విజిలేటర్లు, 8500 ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు ఆయా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర కాన్ఫిడెన్సియల్‌ మెటీ-రియల్‌ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్‌ సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. అలాగే మొత్తం పరీక్షల తీరును పర్యవేక్షించేందుకు ఏపీపీఎస్సీ నుండి 51 మంది అధికారులు నియమితులయ్యారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణకు రూట్‌ మొబైళ్ళు, స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద రిజర్వు సిబ్బందితో గార్డులు ఏర్పాటు చేశారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టిక్కెట్‌లో సూచించిననిబంధనలు పాటించాలని, సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్‌, స్మార్ట్‌ వాచీలు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లు పరీక్షా కేంద్రాలలోకి అనుమతించబడవని అధికారుల స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నందున సమీపంలోని జిరాక్స్‌, ఇంటర్నెట్‌ షాపులు పని చేయరాదని, పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడడం నిషేధమని హెచ్చరికలు జారీ చేశారు.

అభ్యర్ధులు పరీక్షా కేంద్రానికి హాల్‌ టికెట్‌, ఒరిజినల్‌ గవర్నమెంట్‌ అప్రూవ్డ్‌ ఐడి కార్డుతో మాత్రమే రావాలని, అభ్యర్థులు ఎటువంటి మాల్‌ ప్రాక్టీసెస్‌కి, చెడు ప్రవర్తనకు పాల్పడితే, ఏపీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ ప్రాక్టీస్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌, 1997 చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసుశాఖ హెచ్చరించింది. పరీక్షల సందర్భంగా ఎలాంటి అల్లర్లు, అలజడి, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా జిల్లా ఎస్పీలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement