మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల అసెంబ్లీ టిడిపి ఇంచార్జీ బిటెక్ రవికి భద్రత తొలగించడంపై ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ ప్రత్యర్థుల నుండి రవికి ప్రాణహాని వుందని… గన్ మెన్ల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కోరుతూ చంద్రబాబు లేఖ రాశారు. ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసిందనే కారణంతో భద్రతను తొలగించడం సరికాదన్నారు. రాజకీయ ప్రత్యర్థులు, సంఘ వ్యతిరేక శక్తుల బెదిరింపుల నేపథ్యంలో రవికి భద్రత కొనసాగించాలని చంద్రబాబు కోరారు. 2006లో రవి పెదనాన్న ఎం.రామచంద్రారెడ్డి, కజిన్ పి.రామచంద్రారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రవికి కూడా ప్రాణహాని పొంచివుండటంతో ఆనాటి ప్రభుత్వం 1+1 గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పించింది. అంటే ఎమ్మెల్సీగా ఎన్నికవక ముందు నుండే రవికి సెక్యూరిటీ వుండేది.
ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత బిటెక్ రవికి 2+2 భద్రత కల్పించారన్నారు. అయితే ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడాన్ని సాకుగా చూపి అతని భద్రతను తొలగించడం సరికాదన్నారు. బిటెక్ రవిని అంతమొందించాలని, సంబంధం లేని కేసుల్లో ఇరికించాలని రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో రవికి సంబంధాలున్నాయంటూ ప్రత్యర్థులు దుష్ఫ్రచారం చేయడమే కాదు నిందితుడిగా చేర్చాలని కుట్రలు కూడా పన్నారని చంద్రబాబు తెలిపారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున (మార్చి 13న) బిటెక్ రవి కాన్వాయ్‌పై గూండాలు దాడి చేసారని చంద్రబాబు గుర్తుచేసారు. ఈ దాడిలో కారు ధ్వంసమవగా రవి మాత్రం తృటిలో తప్పించుకున్నారని అన్నారు. ఇలా భౌతిక దాడులకు దిగుతూ రవి ప్రాణాలకు హాని కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి భద్రత కొనసాగించాలని కోరుతున్నామని చంద్రబాబు అన్నారు.