(విజయవాడ ప్రభ న్యూస్) : ఎన్నికలు, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ గోదాము భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును సీఈవో ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్ డిల్లీరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా గోదాము భద్రతకు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కొనసాగించేలా చూడాలన్నారు.
జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి నెలా ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. గోదాము భద్రత పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా ఈసీఐ, సీఈవో సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ ఈవీఎం, వీవీప్యాట్ గోదాము తనిఖీ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. సందర్శనలో డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, కలెక్టరేట్ ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్, ఏఏపీ ప్రతినిధి కె.పరమేశ్వరావు, బీజేపీ ప్రతినిధి టి.శ్రీకుమార్, బీఎస్పీ ప్రతినిధి ఎం.వినోద్ కుమార్, ఐఎన్సీ ప్రతినిధి బి.కిరణ్, టీడీపీ ప్రతినిధి వై.రామయ్య, వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి వై.ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.