అమరావతి, ఆంధ్రప్రభ : చిలకలూరి పేట బొప్పూడి వద్ద ఆదివారం జరిగే ప్రజాగళం సభకు ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్న నేపధ్యంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది. ప్రధాని హాజరై తిరిగి వెళ్లేవరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించేలా డీజీపీ కెవి రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
దీనిలో భాగంగా ఐజీ పాలరాజు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో మొత్తం 3,900 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. మోదీ రాక సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజి పాలరాజు పర్యవేక్షణలో పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ వద్ద నుంచి వేదిక వరకు శనివారం వీవీఐపి కాన్వాయ్ ట్రయిల్రన్ నిర్వహించారు.
బందోబస్తు విధులకు హాజరయ్యే మొత్తం 3,900 మంది పోలీసుల్లో 6 గురు ఎస్పీలు, 11 మంది అడిషనల్ ఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, 82 మంది సిఐలు, 256 మంది ఎస్ఐలు, 800 మంది ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్ళు, 1218 మంది కానిస్టేబుళ్ళు, 280 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ళు, 639 మంది హోంగార్డులు, సుమారు 353 మంది ఆర్మ్డ్ రిజర్వు బలగాలు, 149 మంది ప్రత్యేక పోలీసు బలగాలు పాల్గొంటున్నాయి.