ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతాయన్నది అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తుంది. ఇక చంద్రబాబుకు ఎన్నికల ముందు ప్రచారం నిర్వహించే క్రమంలో కూడా ఆయన భద్రత విషయంలో అనేకమార్లు రాజకీయ వర్గాలలో చర్చ జరిగింది. ఏపీలో చంద్రబాబు కు భద్రతపై ఆందోళనల క్రమంలో టిడిపి అధినేత నారా చంద్రబాబుకు కేంద్రం భద్రతను పెంచింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సడెన్ గా భద్రతను పెంచుతూ కేంద్రం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్స్ లో ఒకరు. ఆయన మూడు సార్లు సీఎం గా పనిచేశారు. మరో మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఏపీలో గొడవలు కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబుకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రం గుర్తించింది. దీంతో ఆయనకు హై సెక్యూరిటీ కల్పించింది.
ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలు..
ఈసారి ఎన్నికలు టీడీపీకి లైఫ్ అండ్ డెత్ కావడంతో బాబు ఫుల్ ఎఫర్ట్ పెట్టేశారు అని చెప్పాలి. ఇక పోలింగ్ రోజు నుంచి మొదలైన హింస ఏపీలో ఈ రోజుకూ సాగుతోంది. ఏపీలో పలు ప్రాంతాలు ఇప్పటికీ మండుతున్నాయి. ఎపుడు ఎవరికి ఏ రకమైన ప్రమాదం పొంచి ఉందో అర్ధం కావడంలేదు. దీంతో కేంద్రం సడెన్ గా బాబుకు భద్రత పెంచేసింది. ఏపీలో ఇపుడు ఉన్న రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకి భద్రత పెంచాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేరకు చంద్రబాబు భద్రత కోసం 12 ×12 రెండు బ్యాచులు గా 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు.
భద్రత పెంచిన కేంద్ర హోం శాఖ
దీనికి ముందు బాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, కరకట్ట వద్ద, చంద్రబాబు నాయుడు నివాసం వద్ద, అలాగే గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అలాగే బాబు నివాసం వద్ద కూడా కేంద్ర అధికారులు గత రెండు రోజులుగా పరిశీలించి ఆయన ఎక్కడెక్కడ తిరుగుతారు.. ఆయా ప్రాంతాలలో ఉన్న భద్రతాపరమైన సమస్యలు ఏమిటి అన్నది గుర్తించి మరీ కేంద్ర హోం శాఖకు నివేదిక పంపడంతో బాబుకు భద్రత అమాంతం పెరిగింది. అయితే బాబుకు ముప్పు పొంచి ఉందని గతంలో కూడా కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చాయి. దానికి తగినట్లుగా అప్పట్లో కూడా ఆయన భద్రతను పెంచారు.
ముందస్తు చర్యగా..
మరో వైపు చూస్తే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియడం లేదు. కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద మాత్రం ఒక కచ్చితమైన సమాచారం ఉంది అని అంటున్నారు. దాని ప్రకారం కూడా అన్నీ ఆలోచించి బాబుకు భద్రతను పెంచారని అంటున్నారు. రానున్న రోజులలో ఏపీలో మరింతగా గొడవలు జరుగుతాయన్న సమాచారం కూడా ఉండడంతో కేంద్ర బలగాలను కూడా ఏపీలో కంటిన్యూ చేస్తున్నారు.
ప్రస్తుతం చంద్రబాబుకు ఇంత ఎందుకు భద్రత పెంచారు అన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చగా మారింది. ఆయనకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఇంటిలిజెన్స్ నివేదికలు ఇచ్చిందా? ఎందుకీ భద్రత పెంపు? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక పక్క ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు రక్షణ తగ్గించిన కేంద్రం, ప్రస్తుతం చంద్రబాబుకు రక్షణ పెంచటం ఢిల్లీ పొలిటికల్ వర్గాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, హింసాత్మక ఘటనలు, టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య కొనసాగుతున్న దాడులు, అభ్యర్థుల పైన కూడా కొనసాగుతున్న ఎటాక్‌లు వెరసి జూన్ నాలుగు వరకు శాంతి భద్రతల విషయంలో ఏపీలో కొనసాగుతున్న ఆందోళనల నేపధ్యంలో చంద్రబాబుకు భద్రత పెంపు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నట్లైంది.