తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): వైకుంఠ ఏకాదశికి భద్రతపరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతి నగరంలో 9 ప్రాంతాల్లో వైకుంఠ ఏకాదశికి టోకెన్‌ల జారీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భక్తులు సహనం పాటించాలని, ప్రతి ఒక్క భక్తునికి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారన్నారు.. ఏకాదశి. ద్వాదశి రోజుతో పాటు పది రోజులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా అశేష భక్తి జనం సమూహాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతి నగరంలో 9 ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టోకన్లు జారీ చేయు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. క్యూ లైన్ లో తోపులాట జరగకుండా రద్దీని నియంత్రించడానికి తగిన పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.