న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వివిధ బ్యాంకుల ద్వారా స్వయం సహాయక బృందాలకు పూచీకత్తు లేని రుణ సదుపాయాన్ని 20 లక్షల రూపాయల వరకు పెంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా 34 మహిళా పొదుపు సంఘాలకు కేంద్ర పథకం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసిందని, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 8.4 లక్షల సంఘాలకు బ్యాంకు రుణాలు ఇచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చారు. గతేడాది పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలు లక్షా ఇరవై వేల కోట్లు దాటాయని, గత ఏడేళ్లలో పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ పథకం కింద తక్కువ వడ్డీకే ఇచ్చే బ్యాంకు రుణాలను నాలుగు రెట్లు పెంచినందుకు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఎన్ఆర్ఎల్ఎం పథకం కింద 20 లక్షల రూపాయల వరకు హామీ లేని రుణాలను పొదుపు సంఘాలకు ఇవ్వాలని ప్రైవేట్ బ్యాంకులను ఆదేశించినా కేవలం 10 లక్షల రూపాయల వరకు మాత్రమే బ్యాంకు రుణాలిస్తున్నారని వాటిని 20 లక్షలకు పెంచడానికి కేంద్రం చర్యలు చేపట్టాలని జీవీఎల్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు రాజకీయ కార్యక్రమాల్లో మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులను పాల్గొనమని చెప్పడం అమానుషమని, ఆలా భవిష్యత్లో జరగకుండా కేంద్రం స్పష్టమైన ఆదేశాలివ్వాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..