ఏలూరు, ప్రభ న్యూస్ బ్యూరో : ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత గంజి ప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా పోలీస్ యంత్రాంగం 144 సెక్షన్ అమలు చేసి, శాంతి భద్రతలను పరిరక్షించింది. హోంమంత్రి తానేటి వనిత వచ్చే వరకు అంత్యక్రియలు చేయడానికి కుదరదని గంజి ప్రసాద్ కుటుంబీకులు కొద్ది సేపు పట్టుబట్టారు. . హోంమంత్రి వనిత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతుని ఇంటికి వచ్చి, ఆయన కుటుంబీకులను ఓదార్చారు. తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కేసుపై సత్వర విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని హోంమంత్రి పోలీసులకు ఆదేశించారు.
10మంది నిందితులపై కేసు నమోదు
ఈ హత్యకు సంబంధించి 10 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 120 బి,302 ఐ పిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అన్నారు. కాగా ప్రధాన నిందితుడు బజారయ్య పరారీలో ఉన్నాడు. ప్రస్తుతానికి గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని, నిందితులు మండవల్ల సురేష్, శేనం హమంతు, ఉండ్రాజవరపు మోహన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన ఈ ముగ్గురు బజారయ్య అనుచరులు అని తెలిసింది.