ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. అందరి సందేహాలు, పార్టీ అంచనాలు, గెలుపు లెక్కలు తేలే సమయం వచ్చేస్తోంది. ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న ఓవైపు ప్రజలను, నేతలను గ్రిల్ చేస్తుంటే కౌంటింగ్ సజావుగా ఎలా జరపాలనే సందేహం అధికారులను వేధిస్తోంది. కాగా, రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి గందరగోలం, గొడవలు, ఎర్పడకుండా.. విధ్వంసాలు జరగకుండా రాష్ట్రంలో ఎన్నికల సంఘం పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కేంద్ర బలగాలను భారీగా మోహరిస్తున్నారు.
కేంద్ర బలగాలు ఉన్న ప్రాంతంతోపాటు మిగతా ప్రాంతాలపై కూడా ఎన్నికల సంఘం నజర్ పెట్టింది. అందుకే లెక్కింపు రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్ వధిస్తున్నట్టు ప్రకటించింది. ఆ రోజు ప్రజల రోజు వారి పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో జూన్ ఆరో తేదీ వరకు ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం ఉంది. అదే టైంలో బాణాసంచాపై కూడా ఆంక్షలు పెట్టారు.
జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం 20కంపెనీల బలగాలను బందోబస్తు కోసం ఆంధ్రప్రదేశ్‌లోకి దింపుతోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఘర్షణలతో హీటెక్కిన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రితో పాటు ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బలగాలను మోహరించబోతున్నారు. ఆయా ప్రాంతాల్లో అణువణువూ గాలించి అనుమానితలను అదుపులోకి తీసుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ఇక ప్రస్తుతం పోలీసు శాఖ, ఇతర అధికారులు, సిట్ బృందాల ఆధ్వర్యం చేపట్టిన చర్యలు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ తర్వాత కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని కేంద్ర బలగాల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా తిరుగుతున్నారని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి… ఎన్నికల కోడ్ తొలగిపోయే వరకు ఇదే పరిస్థిత కొనసాగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్టు మీనా వెల్లడించారు.