Saturday, November 23, 2024

స‌చివాల‌యాల కొలువుల్లో పెరుగుతున్న రాజ‌కియ‌ జోక్యం

స‌చివాల‌యాల కొలువుల్లో రోజురోజుకి రాజ‌కీయ జోక్యం పెరుగుతోంది. దీంతో అందులో ప‌నిచేసే ఉద్యోగులు ఉద్యోగం వ‌ద్దంటే వ‌ద్దంటున్నారు. దీనికి కార‌ణంనిత్యం ఏదో ఒక సర్వే , అవగాహన కార్యక్రమం, పథకాలపై ప్రచారాలతో క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తుంటే గత కొంత కాలంగా రాజకీయ జోక్యం పెరిగిందని సిబ్బంది వాపోతున్నారు. దీనికితోడు సచివాలయ కార్యాలయాల నిర్వహణకు నిధులు లేకపోవడంతో వాటి నిర్వహణ సిబ్బందికి భారంగా మారింది.

జిల్లా వ్యాప్తంగా 872 గ్రామ సచివాలయాలు, 442 వార్డు సచివాలయాలు మొత్తం 1314 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో సుమారు11 వేలకు పైగా సిబ్బంది పని చేస్తున్నారు.ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించకుండా నేరుగా పనిచేయవలసి వస్తుందని, రాత్రి పగలు కష్టపడి పనిచేసిన తర్వాత అలా కాదు ఇలా చేయండి అని కొత్త ఎస్‌ఓపి రావడం పరిపాటిగా మారిందని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సెక్రెటరీలకు సంబంధించి ఎంపీడీవో, వ్యవసాయ అధికారులకు, ఎన్‌ఎంలకు మండల వ్యవస్థలో కార్యాలయాలు, పర్యవేక్షించే అధికారులు ఉన్నారు. మిగిలిన శాఖలవారికి గ్రౌండ్‌ లెవెల్‌లో కార్యాల యాలు, పర్యవేక్షించే అధికారులు లేకపోవడం, సమన్వయం చేసే అధికారులు లేకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
అన్నింటా వారే ప్రధానం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో సచివాలయ సిబ్బంది పాత్ర ఎంతో కీలకం. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్‌ 2వ తేదీ 2019 నుంచి సచివాలయ వ్యవస్థను అందుబాటు-లోకి తీసుకు వచ్చారు. సిబ్బందికి 15 వేల రూపాయల జీతం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం అని ఎంతో మంది నిరుద్యోగులు పెద్ద చదువులు చదివిన వారు కూడా సిబ్బందిగా జాయిన్‌ అయ్యారు. వీరికి అప్పట్లో కాస్తోకూస్తో శిక్షణ ఇచ్చి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం రెండు సంవత్సరాల ప్రొహిబిషన్‌ పీరియడ్‌ పూర్తయి పర్మినెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు.
అన్ని పథకాలకు సంబంధించిన సర్వేలు, అవగాహనలు, ప్రచారాలను వీరు నిర్వహించాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు వీరి పనితీరును పర్యవేక్షించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అధికారాలను ఇచ్చింది. దీంతో సచివాలయాలకు అధికారులు, నేతల తాకిడి పెరిగిందని చెబుతున్నారు. వారంలో మూడు నుంచి నాలుగు రోజులపాటు- తనిఖీలు సందర్శనలు ఉంటు-న్నాయని అంటు-న్నారు. కార్యాలయానికి వస్తున్న ప్రజా ప్రతినిధులు తనిఖీల పేరుతో ఒత్తిడి తీసుకురావడంతో పాటు- వారి మాట వినని పక్షంలో దాడులకు సైతం దిగుతున్నారని వాపోతున్నారు.

ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తున్న సమయంలో అర్హులను గుర్తించి వారికి మాత్రమే అనుమతి ఇస్తుంటే, కొందరు నేతలు తమ వారికి వర్తింపచేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు- తెలుస్తోంది. వినకుంటే సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేస్తున్నట్లు- పేర్కొన్నారు. సిబ్బంది కార్యాలయానికి వస్తున్న సందర్భంలో బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేసింది. వేలిముద్రలు లేనిపక్షంలో వీరి జీతాన్ని కట్‌ చేసి చెల్లించే విధంగా ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి ప్రస్తుతం అమలు చేస్తుంది. దీనికితోడు వారంలో ఒకరోజు ప్రభుత్వం అందిస్తున్న 25 సంక్షేమ పథకాల పై స్థానికులకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటినీ సందర్శించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇలా పనిభారంగా మారిందని వాపోతున్నారు.
వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు
ప్రజలకు పాలన చేరువ చేసే క్రమంలో ఏర్పాటు- చేసిన సచివాలయాలకు ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కార్యాలయాల నిర్వహణ అడ్మిన్‌లకు పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి. వాటి నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ప్రభుత్వం అందించినప్పటికీ రోజువారి, నెలవారీ ఖర్చుల కోసం స్పష్టత లేదు. సచివాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా ప్రస్తుతం వాటి అద్దెను గ్రామపంచాయతీలు చెల్లిస్తున్నాయి. ఇక కార్యాలయంలో ప్రతి రోజూ వాడే స్టేషనరీ నుంచి ఇతర ఖర్చులకు ప్రతి నెల సుమారుగా పది వేల రూపాయల వరకు ఖర్చు కానుంది. ఖర్చులకు సంబంధించి స్పష్టమైన విధి విధానాలు లేకపోవడంతో సిబ్బంది నిర్వహణ కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై సత్వర చర్యలు తీసుకుని నిధులను కేటాయించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement