Monday, October 21, 2024

Second Warning – పోటెత్తిన‌ కృష్ణ‌మ్మ – బిక్కు బిక్కు మంటున్న్న లంక గ్రామాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, కృష్ణా జిల్లా బ్యూరో :కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగటంతో లోతట్టు ప్రాంతాలను, కృష్ణానది పరివాహాక ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి కృష్ణానది ఉపనదులైన మున్నేరు, పాలేరు, ఇతర వాగులు, వంకల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తుతోంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికి మొత్తం 7,25,426 క్యూసెక్కు ల నీరు బ్యారేజ్ కు చేరుకుంటుండగా.. అంతే మొత్తం లో నీటిని దిగువకు వదులుతున్నారు.

బ్యారేజ్ కు ఉన్న మొత్తం 70 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి 7,24,976 క్యూసెక్కు లను సముద్రం లోకి విడిచిపెడుతున్నారు. మరో 500 ల క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతున్నారు. రికార్డు స్థాయిలో వరద నీటిని విడుదలచేస్తుండటం, ఇంకా పై నుంచి వరద మరింతగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండటంతో కృష్ణాజిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

కృష్ణానదీ తీర ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించకూడదని,వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదని అధికారులు ఆదేశాలిచ్చారు.

- Advertisement -

పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతలకు తరలించాలని కృష్ణ కలెక్టర్ స్పష్టం చేశారు. అవనిగడ్డ మండలం ఎడ్లంక, దక్షిణ చిరువోలులంక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కృష్ణ కలెక్టర్ అధికారులకు ఆదేశాలిచ్చారు.

తోట్ల వల్లూరు మండలం రావి చెట్టు దిబ్బలంక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తగినన్ని బొట్లు సిద్ధం చేయాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశించారు.8 లంక గ్రామాలకు ముంపు ప్రమాదం..కృష్ణ నది పాయల మధ్య గల 8 లంక గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తోటవల్లూరు వల్లూరి పాలెం గ్రామాలలో పరిశీలించి లంక గ్రామాల ప్రజలను తప్పనిసరిగా తీర గ్రామాలకు తీసుకువచ్చి వారిని సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు.

అలాగే లంక గ్రామాలలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు ఏ ఒక్కటికి హాని జరగకుండా పడవలపైనే తీర ప్రాంతాలకు తరలించేందుకు ఇంజన్ బోట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. వాటి ద్వారా ప్రతి ఒక్కరిని తీర ప్రాంతానికి తరలించి, నిత్యావసరాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కృష్ణానదికి వరద తాకిడి నేపథ్యంలో జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా పోలీసు వారి సహాయం పొందాలనుకుంటే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9491063910 కు లేదా 08672 252090 నంబర్ కు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవలసిందిగా కోరారు.

ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ 24/7 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తూ లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని, నదీ పరివాహక ప్రాంతాల్లో & లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే కృష్ణాజిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబరుకు ఫొన్ చేసి సహాయక చర్యలు పొందాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement