Friday, November 22, 2024

AP: రెండో విడత ఎంబీబీఎస్ మెడికల్‌ కౌన్సిలింగ్ రద్దు చేయాలి.. కాంగ్రెస్ నేతల ఆందోళన

ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రెండో విడత ఎంబీబీఎస్ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆందోళన ఉద్రిక్తలకు దారితీసింది. కౌన్సిలింగ్ రద్దు కోరుతూ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్తున్న పీసీసీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. హెల్త్ యూనివర్సిటీ లోపలకు వెళ్లే క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న పీసీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యు ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో విడత మెడికల్ కౌన్సిలింగ్‌లో జరుగుతున్న అక్రమాలను వైఎస్సార్‌ హెల్త్ యూనివర్శిటీ అధికారుల దృష్టికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు మాట్లాడుతూ… ఏపీలో మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెరుగైన ర్యాంకులు సాధించిన ఎస్టీ, ఎస్టీ విద్యార్ధులకు జనరల్ క్యాటగిరీలో సీట్లు కేటాయించకుండా వారిని రిజర్వుడు స్థానాలకు పరిమితం చేస్తున్నారన్నారు. దీని వల్ల రిజర్వుడు అభ్యర్థులకు సీట్ల భర్తీలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనరల్ క్యాటగిరీలో ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేయాల్సి ఉన్నా, రిజర్వేషన్ క్యాటగిరీలో కేటాయించడం వల్ల సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రెండో విడత కౌన్సిలింగ్‌ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త మెడికల్ కళాశాలలో సీట్ల భర్తీకి 107, 108 జీఓల ద్వారా ఎంబీబీఎస్ సీట్లు అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement