అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో స్క్రాప్(తుక్కు) వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండికొడుతున్నారు. నకిలీ ఫర్మ్స్(సంస్థలు) నిర్వహిస్తూ సర్క్యులర్ ట్రేడింగ్‌తో భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. పైగా ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ కూడా పొందడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా స్క్రాప్ వ్యాపారుల దందా పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా పెద్ద మొత్తంలో స్క్రాప్‌ను బయటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసమే కొన్ని నకిలీ సంస్థలను ఏర్పాటు చేసుకొని వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రధాన పట్టణాలు కేంద్రంగా సాగుతున్న స్క్రాప్ దందా కొందరు అధికారులకు తెలిసినప్ప టికీ చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. స్క్రాప్‌కు విలువపై 18శాతం జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం ఉండటం లేదని చెప్పొచ్చు.
విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాల నుంచి రోజుకు టన్నుల కొద్దీ స్క్రాప్ ఐరన్ తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని రీ-రోలింగ్ సంస్థలకు తరలి వెలుతోంది. స్క్రాప్ వ్యాపారుల నుంచి రూ. కోట్లలో జీఎస్టీ వసూలు కావాల్సి ఉండగా రూ.లక్షల్లో కూడా ఉండటం లేదని విశ్వసనీయంగా తెలిసింది. పెద్ద మొత్తంలో ఫేక్ సంస్థల వేబిల్స్ను వినియోగించడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. వేర్వేరు ప్రాంతాల నుంచి వెళ్లే లారీలకు వీరు నకిలీ సంస్థలకు చెందిన వేబిల్స్ ఉపయోగిస్తున్నారు. అధికారులు తనిఖీ చేసినప్పుడు మాత్రమే ఆ వేబిల్స్ బయట పెడుతున్నారు తప్పలేదంటే తిరిగి వాటిని మరోసారి వినియోగిస్తున్నారు. అక్రమ మార్గంలో జరుగుతున్న స్క్రాప్ వ్యాపారంతో నెలకు రూ.కోట్లలో ప్రభుత్వానికి పన్ను రూపంలో నష్టం జరుగు తున్నట్లు చెప్పొచ్చు. గతంలో ఒకే నెలలో విశాఖపట్టణం కేంద్రంగా రూ.50 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన స్క్రాప్ దందాకు అక్కడి వాణిజ్య పన్నుల శాఖ అధికా రులు చెక్ పెట్టారు. ఆ ఘటనతో కొంతకాలం ఇది ఆగిపోయినప్పటికీ తిరిగి రెండేళ్లు గా మరోసారి అక్రమదందా మొదలైంది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో స్థానికంగా స్క్రాప్ కలెక్టర్లు (సేకరించే వారు) ఉంటారు. వీరు పెద్ద మొత్తంలో సేకరించిన స్క్రాప్‌ను వ్యాపారులకు అందజేస్తుం టారు. కలెక్టర్ల నుంచి కొనుగోలు చేసిన స్క్రాప్‌ను రీ-రోలింగ్ సంస్థలకు వ్యాపారులు అమ్ముతుంటారు. కొన్ని సందర్భాల్లో రైల్వే వంటి ప్రభుత్వ సంస్థల నుంచి కూడా వీరు స్క్రాప్ కొనుగోలు చేస్తుందారు. ఇందుకు స్క్రాప్ విలువపై 18శాతం జీఎస్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా అనధికారికమే కావడంతో ఎక్కడా కూడా వీరు వేబిల్స్ను ఉపయోగించడం లేదు. ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఖచ్చితంగా వేబిల్స్ ఉండాల్సిందే కాబట్టి అక్రమాలకు అక్కడ ఆస్కారం లేదు. కలెక్టర్ల నుంచి సేకరించే దానిలో 90శాతానికి పైగా అక్రమ మార్గాల్లో రీ-రోలింగ్ సంస్థలకు చేరవేస్తున్నట్లు చెపుతున్నారు.
సర్క్యులర్ ట్రేడింగ్..
గతంలో ఎన్నడూ లేని విధంగా స్క్రాప్ వ్యాపారులు సర్క్యులర్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. నకిలీ ఫర్మ్స్ మధ్యనే లావాదేవీలు నిర్వహించినట్లు ఒకరి పేరిట మరొకరు వే బిల్స్ జారీ చేస్తున్నారు. రొటేషన్ విధానంలో ఒకసారి ఒకరు, మరొకసారి మరొకరు అమ్మినట్లు, ఇంకో పార్టీ కొన్నట్లు చూపుతున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో కొనుగోలు చేసినప్పటికీ ఆయా పట్టణాల్లోని తమ లాంటి సంస్థల నుంచి వేబిల్స్ జనరేట్ చేయించుకుంటున్నారు. ఆ వేబిల్స్పై ఉండే చిరునామా, ఇక్కడ జరిగే వ్యాపారానికి ఎక్కడా పొంతన ఉండదు. క్షేత్రస్థాయి అధికారులతో వీరికున్న సత్సంబంధాల ఆధారంగా స్క్రాప్ అక్రమాలకు అడ్డుకట్ట ఉండటం లేదు. ఆయా వేబిల్స్ ఆధారంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా వీరు పొందుతున్నారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..