Saturday, November 23, 2024

Big story | అలల నుంచి విద్యుత్‌ ఉత్పత్తిచేసే చాన్స్‌.. పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

అమరావతి, ఆంధ్రప్రభ : సముద్ర అలల నుండి విద్యుత్‌ పుట్టించవచ్చా.. సముద్ర కెరటాలతో వెలుగులు నింపవచ్చా.. ఆటుపోట్ల నుండి శక్తిని ఉత్పత్తి చేయవచ్చా.. అనే ఆలోచనలతో శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రయోగాలు విజయవంతమై ఆచరణలోకి వస్తున్నాయి. ప్రపంచానికి భవిష్యత్‌లో కరెంటు కష్టాలు ఉండవనే ఆశలు కల్పిస్తున్నాయి. సముద్రం నుండి విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో సవాళ్లు, గ్రిడ్‌ కనెక్టివిటీ లేకపోవడంతో ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. మార్కెట్లలో గ్రిడ్లు చిన్నవిగా, అస్థిరంగానూ ఉంటాయి. అయినప్పటికీ సాంకేతికపరంగా ఆర్ధికపరంగా కష్టం, ఖర్చుతో కూడుకున్న ఓషన్‌ థర్మల్‌ ఎనర్జీ, వేవ్‌, టైడల్‌ పవర్‌ జనరేషన్‌ వంటి సముద్ర పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు ప్రస్తుతం 31 దేశాల్లో విస్తరిస్తున్నాయి.

మెరైన్‌ టెక్నాలజీల నుండి విద్యుత్‌ ఉత్పత్తి రెండేళ్లక్రితంతో పోలిస్తే 33 శాతం పెరిగింది. మన రాష్ట్రంలోనూ అలల నుండి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలనే ఆలోచనపై అధ్యయనం జరిగిందంటే ఈ సాంకేతికత ఎంతగా విశ్వవ్యాప్తమయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐరోపాలో ఈ ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర శక్తి సామర్ధ్యంలో 98 శాతం వాటా దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌, కెనడా దేశాలదే. పెట్రోలియం ఆధారిత ఇంధనాలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండటంతో అనేక దేశాలు సముద్రం, ఉష్ట, హైడ్రోజన్‌, ఆఫ్‌ షోర్‌ విండ్‌, సోలార్‌ వంటి టెక్నాలజీల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.

- Advertisement -

రెట్టింపుకంటే ఎక్కు విద్యుత్‌..

ఆగ్నేయాసియాలో అలల నుండి విద్యుత్‌ ఉత్పత్తికి గల అవకాశాలను నిపుణులు పరిశీలించారు. అక్కడి తీర ప్రాంతాలకు టైడల్‌ శక్తిని ఉత్పత్తిచేసే సామర్ధ్యం ఉందని గుర్తించారు. భారత్‌, ఫసిఫిక్‌ మహా సముద్రంలోని మారిటైమ్‌ ఆగ్నేయాసియా అని పిలిచే ద్వీపాలు, సముద్ర సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి. పునరుత్పాదక శక్తి సాంకేతికతలను అక్కడ నివశిస్తున్న 660 మిలియన్లకుపైగా ప్రజలకు ఎలా ఉపయోగించవచ్చనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. వాటిలో భాగంగా ఓషన్‌ థర్మల్‌ ఎనర్జీ, లవణ సాంకేతికతలు, వేవ్‌, టైడల్‌ పవర్‌ జనరేషన్‌ వంటి సముద్ర పునరుత్పాదక శక్తిపై దృష్టి సారించారు.

ఇంటర్నేషనల్‌ రెన్యూవబుల్‌ ఏజెన్సీ (ఐరెనా) చెబుతున్న దాని ప్రకారం సముద్రాలకు పునరుత్పాదక శక్తి సామర్ధ్యం చాలా ఎక్కువ. పముద్ర విద్యుత్‌ చిన్న ద్వీపం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన విద్యుత్‌ అందించగలదని, సముద్ర నీటి డీశాలినేషన్‌ ద్వారా తాగు నీటి సరఫరాను పెంచుతుందని ‘ఇన్నోవేషన్‌ ఔట్‌ లుక్‌ ఎనర్జీ టెక్నాలజీస్‌’ నివేదిక నిర్ధారించింది. దీనివ్లల అదనంగా ఉద్యోగాల కల్పన పెరుగుతోంది. స్థానికుల జీవనోపాధి మెరుగుపడుతుంది. సామాజిక, ఆర్ధిక ప్రయోజనం లభిస్తుంది. ఆ నివేదిక వెల్లడించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు సవాళ్లను అధిగమించి సముద్ర శక్తిని ఒడిసిపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మన రాష్ట్రంలో అధ్యయనం..

రాష్ట్రంలోనూ సముద్ర అలల నుండి విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అడుగులు పడ్డాయి. విశాఖ-కాకినాడ మధ్య తీరంలో 100 కేవీ అలల విద్యుత్‌ సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు. నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (నెడ్‌కాప్‌) ఆధ్వర్యంలో అలల విద్యుత్‌పై ఓ అధ్యయనానికి శ్రీకారం జరిగింది. అలల విద్యుత్‌ కేంద్రాలు నెలకొల్పితే వాటిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ మొత్తాన్ని జెన్‌కో కొనుగోలుచేసే అవకాశాలపైనా చర్చ జరిగింది. ఇందుకోసం 12 తీర ప్రాంతాల్లో కూడా అలల విద్యుత్‌ అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, ప్రస్తుత తరుణంలో ఈ ప్రయత్నం అత్యంత ఖర్చుతోనూ, సాంకేతికంగా కష్టంగానూ కూడుకున్న వ్యవహారం కావడంతో మరింత సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చే వరకూ వేచి ఉండటం మంచిదని భావించి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం లేదు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా మన రాష్ట్రంలోనూ అలల నుండి కరెంటు పుట్టే అవకాశం ఉందని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement