అమరావతి, ఆంధ్రప్రభ: జూలై ఐదు నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. విద్యాశాఖ నిర్దేశించిన ప్రకారం ఈరోజు (మంగళవారం) నుంచి ఐదో తేదీ వరకు పాఠశాల సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కోవిడ్ ముందు వరకు ఏటా జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభమై ఏప్రిల్ 23 వరకు కొనసాగేవి. ఈ విద్యా సంవత్సరం(2022- 23) జూలై 5 నుంచి తెరుచు కోనున్న పాఠశాలలు వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీ వరకు కొనసా గనున్నాయి. అలాగే విద్యా సంవత్సరంలో220 పని దినాలు ఉంటాయి. ఒకటి నుంచి 9వ తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) ప్రకటించింది.
ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు కొనసాగాలి.. సాయంత్రం 3.30 నుంచి 4 వరకు ఆటలు, పునశ్చరణ తరగతుల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆటలు, పునశ్చరణ తరగతులను ఐచ్ఛికంగా నిర్వహించుకోవచ్చు. వారంలో ఒక రోజును ‘నో బ్యాగ్ డే’గా నిర్వహించాలి. పాఠశాలల్లో తరగతులు ప్రారంభమయ్యే జూలై ఐదో తేదీనే విద్యార్థులకు జగనన్న విద్యాకానుకల కిట్లను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.