Friday, November 22, 2024

ఏపీలో జులై 5 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జులై 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ప్రతి ఏటా జూన్‌ 12న పాఠశాలలు పునః ప్రారంభమై ఏప్రిల్‌ 23 వరకు కొనసాగేవి. ఈ విద్యాసంవత్సరం(2022-23 ) జులై 5 నుంచి పునఃప్రారంభం అయ్యే పాఠశాలలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించింది. పాఠశాలలు 220 రోజులు పని చేయనున్నాయి. ఒకటి నుంచి 9 వ తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 27తో ముగుస్తాయని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) అకడమిక్‌ స్పష్టం చేసింది. ప్రతి తరగతికి వారానికి 48 పీరియడ్లు ఉంటాయి. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి 38 నుంచి 39 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. ఒకటి నుంచి 5 తరగతుల ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు కొనసాగించాలని సూచించారు. సాయంత్రం 3.30 నుంచి 4 వరకు ఆటలు, పునశ్చరణ తరగతుల నిర్వహణ చేపట్టాలని వెల్లడించారు. ప్రీహైస్కూల్‌, హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, 4 గంటల నుంచి 5గంటల వరకు ఆటలు, పునశ్చరణ తరగతులను ఆయా బడులు ఐచ్ఛికంగా నిర్వహించుకోవచ్చని ఎస్‌సీఈఆర్టీ తెలియజేసింది. మరోవైపు వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’ ఉంటుంది. జులై 5 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటికీ… ఉపాధ్యాయులు మాత్రం ఈ నెల 28 (రేపు) నుంచే పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలోగా తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాలు శుభ్రం చేయించాల్సి ఉంటుంది. 29న తల్లిదండ్రుల కమిటీలు, ఇతర ప్రభుత్వా విభాగాలతో సమావేశాలు నిర్వహించాలి. జులై 5న విద్యార్థులకు విద్యా కానుకల కిట్లను పంపిణీ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement