విద్యాశాఖ అధికారుల తనిఖీలు నామమాత్రమే..
విద్యాశాఖపై జిల్లాలో పలు ఆరోపణలు..
నంద్యాల బ్యూరో, ఆగస్టు 12 ప్రభ న్యూస్ : గత వారం రోజుల క్రితం నంద్యాల పట్టణ శివారు గ్రామంలో ఉన్న ఎస్ డి ఆర్ పాఠశాలలో కరస్పాండెంట్ పుట్టిన వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులు తిన్న ఆహారం విషతుల్యం కావడంతో సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన జరిగింది. కలెక్టర్ ఆదేశాలు మేరకు అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి నివేదికను బుట్ట దాఖలు చేసిన సంఘటన జరిగింది.
ఈ సంఘటన మరువక ముందే జిల్లా కేంద్రం నంద్యాలలోని సంజీవ్ నగర్ లో ఉన్నటువంటి శాంతినికేతన్ పాఠశాలలో ఇవాళ ఉదయం రేకుల షెడ్డు పైకప్పు కూలి ఏడవ తరగతి విద్యార్థులు 15మందికి తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు పెద్ద ఎత్తున పాఠశాలకు వచ్చి అక్కడ జరుగుతున్న సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన పిల్లలను తల్లిదండ్రులకు ఇంటికి తీసుకెళ్లారు. విద్యార్థులకు ఫీజుల రూపంలో వేల రూపాయలు వసూలు చేస్తున్న ఈ ప్రైవేటు పాఠశాలల దుస్థితికి విద్యాశాఖ అధికారులు కారణమని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గాయపడిన విద్యార్థుల నుండి పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అయినా రేకుల షెడ్డులో పాఠశాల నిర్వహించడమేమిటిని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు రెన్యువల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పాఠశాలలంతా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా ఎన్నటికీ జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు విద్యార్థులు తల్లిదండ్రులకు నచ్చ చెప్పి ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తామని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.