ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్దులతో పాటు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు కూడా తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61 వేల 137 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించింది. అన్ని పాఠశాలలో కరోనా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలల్లో మాస్కు, భౌతికదూరం, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతించి భోదన చేస్తున్నారు. విద్యార్ధులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ తెచ్చుకుని పాఠశాలలకు రావాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. పాఠశాలల్లోకి వచ్చే ముందు ప్రతి విద్యార్ధిని ఉష్ణోగ్రత పరిశీలించిన అనంతరమే తరగతి గదిలోకి అనుమతిస్తున్నారు. ఇవాళ మొదటి రోజు విద్యార్ధుల హాజరును బట్టి.. విడిచి రోజు తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందని చెప్పినప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పాఠశాలల్లో విద్యాభోదన సాగిస్తామని తెలిపారు
మరోవైపు పాఠశాల విద్యలో నేటి నుంచి నూతన విద్యా విధానం అమలు చేస్తున్నారు. పాఠశాల విద్యా వ్యవస్థ ఆరు విభాగాలుగా మారనుంది. పూర్వ ప్రాథమిక విద్య1, 2 శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా మారనున్నాయి. ప్రీప్రైమరీ 1,2 సహా ఒకటి, రెండు తరగతులు ఉంటే ఫౌండేషన్, 1 నుంచి 5 తరగతులు ఉంటే ఫౌండేషన్ ప్లస్ గా మారనున్నాయి. 3 నుంచి 8వ తరగతి వరకు ఉంటే ప్రీ హైస్కూళ్లు, 3 నుంచి 10వ తరగతి వరకు ఉంటే ఉన్నత పాఠశాలలు, 3 నుంచి 12 వరకు ఉంటే హైస్కూల్ ప్లస్ గా మారాయి.