Sunday, September 15, 2024

Satyavedu – ఎమ్మెల్యే ఆదిమూలంకు గుండెపోటు..


తిరుపతి ( రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : లైంగిక వేధింపుల చిక్కుల్లో చిక్కుకున్న సత్యవేడు ఎం ఎల్ ఏ ఆదిమూలం వివాదం రోజుకో మలుపులు తిరుగుతోంది. నిన్న తనపై కుట్ర జరిగిందని వాదించిన ఆదిమూలం ఈరోజు గుండెపోటు తో చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరారు. అధికార తెలుగుదేశం పార్టీ నిన్న ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయగా ఈరోజు తిరుపతి ఈస్ట్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసారు. వివాదంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆదిమూలం తన ఎం ఎల్ ఏ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపండుకుంటోంది.


తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆదిమూలం తనను బెదిరించి లైంగికంగా వేదిస్తున్నారనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ కి చెందిన ఓ మహిళ వీడియో, ఆడియో ఆధారాలతో రచ్చకెక్కడం తో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.


అయితే అదంతా మార్ఫింగ్ వీడియో అని, తనపై కుట్ర పన్నారని ఆదిమూలం వాదించినా ఫలితం లేకపోయింది. ప్రాధమిక ఆధారాలతో ఆదిమూలం ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రకటించారు.
ఇదిలావుండగా ఈరోజు ఆదిమూలం చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. గుండెపోటు తో ఆయన చేరారని, ఆయనకు స్టంట్లు కూడా వేశారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాధారణంగానే గుండె సంబంధిత సమస్య ఉన్న ఆదిమూలం వివాదం రేగిన నేపథ్యంలో చికిత్స కోసం హాస్పిటల్ లో చేరారనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు తిరుపతి ఈస్ట్ పోలీసులు ఈరోజు ఆదిమూలం పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసారు. బాధిత మహిళ చేసిన పిర్యాదు ఆధారంగా ఘటన జరిగిన హోటల్ లో సి సి ఫుటెజీ మొదలైన ఆధారాలను సేకరించి అయన పై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసారు.

- Advertisement -


ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆదిమూలం అనుకూల ప్రతికూల వర్గాలుగా విడిపోయాయి. ఆయన వ్యతిరేక వర్గం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలనీ అంటూ ఉంటే అనుకూల వర్గీయులు ఇదంతా పార్టీ కి చెందిన కొందరు పధకం ప్రకారం పన్నిన కుట్ర అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదిమూలం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఊపండుకుంటోంది. ఈ ప్రచారం మాటున గతంలో సత్యవేడు నియోజకవర్గ పార్టీ అభ్యర్తిత్వం కోసం పోటీ పడిన వారిలో కొందరు ఈసారి మరింత గట్టిగా టికెట్ తెచ్చుకోవాలని అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం ఆదిమూలం అరెస్టుకు చట్టపరంగా సన్నాహాలు మొదలుపెట్టారని మాత్రం స్పష్టం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement