అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఢీల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరశన దీక్షలో కూర్చొన్నారు. రాజమండ్రిలో దీక్ష చేపట్టే ముందు భువనేశ్వరీ అక్కడ సెంటర్లో ఉన్నగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు..
అలాగే ఢిల్లీలో నారా లోకేష్ తో కలసి టిడిపి ఎంపీలు కేశినేని నానీ, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల తదితరులు గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లోకేష్ జగన్ ను విమర్శిస్తూ ట్విట్ చేశారు. సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. రాజ్యాంగాన్ని కాలరాశారు. సత్యాన్ని వధించారు, ధర్మాన్ని చెరపట్టారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తోన్న అరాచకాలని నిరసిస్తూ మహాత్మా గాంధీ జయంతి రోజైన నేడు.. నిరాహార దీక్ష చేసి చంద్రబాబు గారికి సంఘీభావం తెలుపుతున్నాను. సత్యమేవ జయతే. అంటూ పేర్కొన్నారు.. నారా లోకేష్ దీక్షలో వైసిపి రెబల్ ఎంపి రఘరామ రాజు కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు..
ఇక మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలు దీక్షలో కూర్చొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు తెదేపా నేతల దీక్ష కొనసాగనుంది. ఇదే సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైలులోనే నిరశన దీక్ష చేపట్టారు..