( ఆంధ్రప్రభ స్మార్ట్, తిరుపతి ప్రతినిధి) తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్ సిబ్బంది పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చివేశారని ఆయన విమర్శించారు. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని, నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో నిరంతరంగా రెగ్యులర్ తనిఖీలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతో సామాన్యులకు వైద్య సేవలు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు.
నిధుల దుర్వినియోగంలో.. జగన్ దిట్ట
సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రం నుంచి నిధులు రాష్ట్రం నుంచి సమన్వయ నిధులు కలిపి ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. గత పాలకులు రిషికొండలో విలాసవంత భవనాలు తాడేపల్లిలో ప్రభుత్వ వ్యయంతో రహదారుల నిర్మాణాలు చేసుకొని విలాసవంతమైన జీవితం అనుభవించారని విమర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేణిగుంట నుంచి తిరుపతి రావడానికి కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను వాడారన్నారు. అంటే ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారో అర్థమవుతుందన్నారు.