సరస్వతీ పవర్ పేరుతో మోసం చేశారు
కంపెనీ లేదు, ఎవరికీ ఉపాధి లేదు
చెన్నాయపాలెంలో చేయడానికి ఏమీ లేదు
15 ఏళ్లుగా ఊళ్లో పని దొరకడం లేదు
చేతిలో పైసా లేక ఇబ్బందులు పడుతున్నాం
భూములు తిరిగి ఇస్తారా? పరిహారం పెంచుతారా!
ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం ఎకరాకు ₹18 లక్షలివ్వాలి
లేకుంటే మా భూముల్లో మేమే సేద్యం చేసుకుంటాం
ఎవరు అడ్డొస్తారో చూస్కుంటాం.. పోరాటానికి మేం రెడీ
ఇదీ సరస్వతీ బాధిత పల్నాడు రైతుల డిమాండు
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కోసం రైతుల నుంచి సేకరించిన భూముల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 15 ఏళ్ల కిందట తమ నుంచి కొనుగోలు చేసిన భూముల్లో విద్యుత్, సిమెంటు పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారని, అదేవిధంగా తమకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని ‘సరస్వతి పవర్ ’ కోసం భూములు ఇచ్చిన పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన రైతులు చెబుతున్నారు. కానీ, ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు చేయకపోగా, తమకు ఉపాధి కూడా కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూములిస్తారా?. పరిహారం పెంచుతారా?
తమ భూములు తమకు ఇచ్చేయాలని చెన్నాయపాలెం రైతులు పట్టుబడుతున్నారు. లేకపోతే.. ప్రస్తుత ధర ప్రకారం ఎకరానికి ₹18 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఉంటే తక్షణమే పరిశ్రమ ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ‘‘మీ గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. మౌలిక వసతులు కల్పిస్తాం. అర్హతలు ఉన్న వారికి పరిశ్రమలో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం”. అని అప్పట్లో అనేక హామీలు ఇచ్చారు. 15 ఏళ్ల కిందట అతి తక్కువ ధరకే మా నుంచి భూములు కొనుగోలు చేశారు. కానీ, ఇప్పటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు’’ అని చెన్నాయపాలెం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తమ భూములు తిరిగి తమకు అప్పగించాలని కోరుతున్నారు. భూములు కొని సుమారు 15 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్నారు. కానీ, అప్పట్లో రెండు మూడేళ్లలోనే నిర్మాణం చేపడతామని నమ్మబలికారని తెలిపారు.
భవిష్యత్తుపై ఆశతో కారు చౌకగా..
పరిశ్రమను నిర్మిస్తే తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు వస్తాయని, తమకు ఉపాధి దొరుకుతుందని, గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశపడి తక్కువ ధరకే అప్పట్లో రైతులు భూములు ఇచ్చారు. దాచేపల్లి, మాచవరం మండలాల్లో 1,515 ఎకరాల రైతుల భూముల్ని కారుచౌకగా కొనేశారు. మాచవరం మండలంలో1077.38 పట్టా భూములను ఫ్యాక్టరీ యాజమాన్యం గతంలో కొనుగోలు చేసింది. మాచవరం మండలంలోని చెన్నాయపాలెం గ్రామంలో 272.96 ఎకరాల భూమి, పిన్నెల్లి గ్రామంలో 93.79 ఎకరాలు, వేమవరం గ్రామంలో 710.63 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. మొత్తం మాచవరం మండలంలో 1073.38 ఎకరాలు గ్రామ ప్రజలు నుంచి సరస్వతి పవర్ యాజమాన్యానికి విక్రయించారు. ఈ భూముల్లో చెరువు భూములు గాని, అటవీ భూములు కానీ లేవు. ఈ భూమిలో 821.44 ఎకరాలు పోర్టెడ్ (సురక్షిత ప్రాంతంగా ప్రకటించారు) చేశారు. మిగిలిన 255.94 ఎకరాలు పోర్టెడ్ చేయాలి. పిన్నెల్లి గ్రామంలో 2.87 ఎకరాలు, వేమవరం గ్రామంలో 1.44 ఎకరాలు, మొత్తం కలిపి 4.31 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఇటీవల సర్వే జరిపిన అధికారులు తెలిపారు. ఇక దాచేపల్లి మండలంలో ప్రభుత్వ భూములనూ సరస్వతీ పవర్ సంస్థ తమ ఆధీనంలో తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కంపెనీ కట్టలేదు.. కర్షకుల భూమీ లేదు
పరిశ్రమ నిర్మాణం గురించి అడిగితే చూస్తాం, చేస్తాం అని చెప్పటమే కానీ.. నిర్మించింది లేదని స్థానిక రైతులు మండిపడుతున్నారు. పరిశ్రమను నిర్మించే వరకు ఎవరి భూములు వారు సాగు చేసుకుంటామని, నిర్మాణం మొదలు పెట్టగానే ఇచ్చేస్తామని తాము చెప్పినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ కట్టలేదు. ఊళ్లో పని లేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ స్థితిలో కొంత మంది రైతులు ఉపాధి అవకాశాలు దొరక్క ‘సరస్వతి’కి ఇచ్చిన భూముల్లో పంటలు సాగు చేశారు. ఇది గమనించిన వైసీపీ నాయకుడు, అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో కడప గూండాలు సుమారు ఐదు వందల మంది ట్రాక్టర్లతో వచ్చి పచ్చని పంట పొలాలను దున్నేసి విధ్వంసం సృష్టించారని బాధిత రైతులు తెలిపారు. అడ్డు వచ్చిన మహిళా రైతులను విచక్షణా రహితంగా కొట్టి గాయ పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక.. ఉద్యమమే..
ఇది తెలుసుకున్న టీడీపీ నేత, గురజాల ప్రస్తుత ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను, జిల్లా అధికారులను పిలిపించి నష్టపోయిన రైతులను గుర్తించారు. ఒక్కొక్క ఎకరానికి ₹16 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అయితే.. రెండు మూడు రోజులుగా వైసీపీ అధినేత జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య సరస్వతి భూముల వ్యవహారంలో విభేదాలు తలెత్తడంతో ఇక పరిశ్రమ నిర్మాణం చేపట్టరని తేలిపోయినట్టు బాధితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఆ భూములను తిరిగి ఇస్తే సాగు చేసుకుంటామని చెబుతున్నారు. లేకుంటే ఎవరు అడ్డొస్తారో చూస్తామని, మా భూముల కోసం.. పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమించాల్సి వస్తుందని అధికారులతోపాటు కంపెనీ పెద్దలను హెచ్చరించారు.