Friday, November 22, 2024

AP: శరణు శరణు శాకాంబరీ దేవి..

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు…
నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహణ..
అమ్మవారికి కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పండ్లతో అలంకరణ..
అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణమంతా కూరగాయలతో సుందర అలంకరణ..
దర్శనం అనంతరం కదంబ ప్రసాదాన్ని స్వీకరిస్తున్న భక్తులు..
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివస్తున్న భక్తులు…
ఆషాడ సారే, వారాహి ఉత్సవాలు, శాఖంబరి ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : దరిద్రాన్ని, దుఃఖాన్ని పారద్రోలి భయాలను సంహరించి అందరికీ ఉపకారాన్ని చేసే సర్వ ఉపకారినిగా పేరుగాంచిన ఆ అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మను శరణు శరణు శాకాంబరి అంటూ భక్తులు వేడుకుంటున్నారు. సకాలంలో పాడిపంటలు సమృద్ధిగా వచ్చి, కరువు కాటకాలను పాల ద్రోలి, యావన్మంది సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రతిఏటా కనకదుర్గమ్మ వారికి నిర్వహించే శాఖంబరి ఉత్సవాలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆషాడ శుద్ధ త్రయోదశి నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలను మూడు రోజులపాటు అమ్మవారికి అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ శాఖంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారితో పాటు ప్రధాన ఆలయం, ఉప ఆలయాలన్నింటినీ మూడు రోజులపాటు కూరగాయలు, ఆకుకూరలు,పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో సర్వాంగ సుందరంగా అలంకరించి, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉత్సవాల్లో ప్రధానమైన కథంబ ప్రసాదాన్ని అందించనున్నారు. శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం అమ్మవారి మూల విరాట్ తో పాటు ప్రధాన ఆలయం, ఉప ఆలయాలన్నింటినీ, దేవతా మూర్తుల విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలను తాజా కూరగాయలు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కరువు, కాటకాలను పాల ద్రోలాలనీ వేడుకుంటూ రైతులు పండించిన తమ మొదటి పంటను అమ్మవారికి కానుకగా అందజేసిన నేపథ్యంలో ఈ ఏడాది శాకాంబరీ ఉత్సవాల కోసం సుమారు 40 టన్నుల మేర కూరగాయలు అమ్మవారికి కానుకగా వచ్చాయి.

- Advertisement -

రైతులతో పాటు హోల్సేల్ వ్యాపారులు పలువురు జాతుల సహకారంతో ఈ ఏడాది శాకాంబర ఉత్సవాలను మూడో రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇంద్రకీలాద్రి మొత్తం కూరగాయలతో అలంకరించి ఉన్నది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శాకాంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు.

శ్రీ అమ్మవారికి శాకంబరీదేవి గా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషముగా అలంకరణ చేసి పూజ వైదిక కార్యక్రమాలు నిర్వహించిన భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు, రైతులు సుఖశాంతులు సంతోషాలతో జీవించుదురని ఆలయ ఈవో కె ఎస్ రామరావు తెలిపారు. ఆషాడమాసం ప్రారంభం నుండి అమ్మవారికి ఆషాడ చారి సమర్పణ వారాహి ఉత్సవాలు ప్రస్తుతం శాకంబరీ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రి మొత్తం సరికొత్త ఉత్సవ, ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement