అమరావతి, ఆంధ్రప్రభ : సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ నిషేధ చట్టం కింద సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు నేతృత్వంలో అధికార వైసీపీ నాయకులు కొందరు టిక్కెట్లు విక్రయించారని జనసేన పార్టీ నాయకులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల మంత్రి సంక్రాంతి లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించి బహుమతులు అందచేసిన విషయం తెలిసిందే.
కాగా జనసేన ఫిర్యాదుపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీంతో గుంటూరు కోర్టులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన గుంటూరు కోర్టు మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సత్తెనపల్లి పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.