Friday, November 22, 2024

Sankranthi T 20 – సిక్స్ ప్యాక్ పుంజు ! పందానికి రెడీ

పందానికి పుంజులు రెడీ అవుతున్నాయి. స్పెషల్​ ట్రైనింగ్​ తీసుకుని మరీ పోటీలకు సన్నద్ధమవుతున్నాయి. పెంపకంలో హై క్లాస్​ ఫుడ్​.. అంతకుమించిన ట్రైనింగ్​తో తర్ఫీదు తీసుకుంటున్నాయి. సాధారణంగా కోళ్లకు వేసే దాణా వీటికి ఏమాత్రం సరిపోదు. అందుకని జీడిపప్పు, బాదంపప్పుతోపాటు.. మటన్​ కీమా కూడా పెడుతూ పందెం రాయుళ్లు వీటిని రంజుగా పెంచుతున్నారు. దీంతో పుంజులు ఇప్పుడు సిక్స్​ప్యాక్​తో కండలు తిరిగిన యోధుల్లా.. బరిలో దిగి కత్తులు దూయడానికి సై అంటున్నాయి. దీనికోసం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ట్రైనింగ్​ సెంటర్లు కూడా ఉన్నాయి. పుంజుల‌ హెల్త్​ రివ్యూ కోసం స్పెష‌ల్​ డాక్టర్లను కూడా పెట్టుకున్నారు. ఇక.. మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రానుంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో పందాలకు తెరతీయనుండగా.. కత్తుల సమరంలో గెలిచి కోట్ల కొద్దీ డబ్బు కొల్లగొట్టేందుకు చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా నెమలి, కాకి, డేగ, అబ్రాస్​, సీతువ, పచ్చకాకి, రసంగి.. వంటి ప్రత్యేకమైన జాతి కోళ్లను రెడీ చేస్తున్నారు.

ఏలూరు బ్యూరో (ప్రభ న్యూస్​) : ఒకపక్క రానున్న ఎన్నికల్లో తలపడేందుకు నాయకులు సిద్ధమవుతుంటే.. మరోపక్క సంక్రాంతి సంబరాలలో ఢీ కొనేందుకు సిక్స్ ప్యాక్​తో పందెం కోళ్లు రెడీ అవుతున్నాయి. అధికార యంత్రాంగం కోడి పందాలు నిషిధం అంటూ నిబంధనలు పెడుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. జూదం ఆడితే చర్యలు తప్పవని హెచ్చరికలు ఉన్నా.. ఎట్టి పరిస్థితుల్లో అయినా సంక్రాంతి వేళ కోడి పందాలు ఆడి తీరుతామని పందెం రాయుళ్లు సవాల్​గా తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో కోడి పందాలకు ప్రసిద్ధి చెందిన గోదావరి జిల్లాలో సంక్రాంతి నాలుగు రోజులూ ఎక్కడ చూసినా కోడి పందాల హడావిడే ఉంటుంది. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాల్లో కనిపించినంత సందడి వాతావరణం మరెక్కడా కనిపించదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాలుగు రోజుల్లో 200 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు పందాల్లో చేతులు మారతాయంటే ఈ కోడిపందాలు ఆషామాషీ కాదు. కోడిపందాలు నిర్వహించడం చట్టవ్యతిరేకమైనప్పటికీ సాంప్రదాయం ముసుగులో భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఆ నాలుగురోజులూ సైలెంట్ అయిపోతారంటే, రాజకీయ ఒత్తిళ్లు కోడిపందాల విషయంలో ఏ మేర పనిచేస్తాయో కూడా ఆలోచించవచ్చు. రాజకీయ నేతలే కాకుండా దేశ విదేశాల నుండి వ్యాపార, సినీ ప్రముఖులూ ఈ కోడిపందాలకు రావడం విశేషం. మరి, అలాంటి కోడి పందాలు నిర్వహించాలన్నా, ఆ పందాల్లో కోళ్లు పాల్గొనాలన్నా ఎంతో శ్రమటోర్చి కోళ్లను సిద్ధం చేయాలి. దీంతో పందెపు రాయుళ్లు కోడి పందాల్లో తమ కోళ్లే గెలవడం పరువు ప్రతిష్టలుగా భావించి, పందాలకు ఉపయోగించే పుంజులను ఎంతో జాగ్రత్తగా ప్రత్యేక శిక్షకులను ఏర్పాటుచేసిమరీ పెంచుతున్నారు. ఇందుకోసం పెదవేగి, చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, నల్లజర్ల, అత్తిలి, ఆచంట, పెరవలి, భీమవరం, ఉండి, గణపవరం, పాలకొల్లు, నర్సాపురం ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ట్రైనింగ్ సెంటర్లు మూడు పువ్వులు, ఆరుకాయలుగా పందెంకోళ్లను పెంచుతూ, అభివృద్ధి చెందుతున్నాయి.

పందెం కోళ్లకుప్రత్యేక తర్ఫీదు
పందెం కోళ్లలో ప్రత్యేక జాతులకు తర్ఫీదునిస్తారు. వాటిలో డేగ, కాకి, నెమలి, ఇలా అనేక జాతులను ఎంపిక చేసి, అవితినే ఆహారం, వాటి నివాసం, ఆరోగ్యం వంటి విషయాల్లో పందెపురాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకునిమరీ పెంచుతున్నారు. పొద్దున్నే కోడిగుడ్డు సొనను పుంజుకు తాగించి, అనంతరం కొద్దిసేపు వ్యాయామం చేయించడంతో పాటు కాళ్లతో పాటు శరీరం కూడా గట్టిపడేందుకు వాకింగ్, స్విమ్మింగ్ చేయిస్తున్నారు. తర్వాత పందాల్లో గాయమైనా రక్తం కారకుండా ఉండడం కోసం పుంజు శరీరం గట్టిపడేలా ఆవిరి పడుతూ, ఈత కొట్టిస్తున్నారు. ఇలా యుద్దానికి సిద్దమయ్యే సైనికుడిలా పందెపు కోళ్లను పందేలకు సిద్దం చేస్తున్నారు. అంతేకాకుండా కోడిపుంజుల మెనూ కూడా ఎంతో కాస్ట్లీ గానే ఉంటుంది. ప్రత్యేకంగా పౌష్టికాహారం అందించే ఉద్దేశ్యంతో చోళ్లు, మినప్పప్పు, జీడిపప్పు, బాధం పప్పు గింజలు, నెయ్యితో కలిపి తయారుచేసిన ప్రత్యేక ఆహారంతో పాటు వేట మాంసం, మటన్ కైమాలను కూడా కోడిపుంజులకు సామర్ధ్యాన్ని బట్టి తినిపిస్తుంటామని కోడిపుంజుల పెంపకందారులు చెబుతున్నారు.

వివిధ దేశాల నుండి కోడిపుంజులు దిగుమతి
కోడిపుంజు వయసు 18 మాసాలు వచ్చిన త‌ర్వాత‌ పందాలకు వేయడానికి ఉపయోగిస్తామని, బలమైన పుంజులకోసం థాయిలాండ్, తైవాన్, మలేషియా వంటి దేశాలతో పాటు కోయంబత్తూర్, సేలం, మద్రాస్ నుండి కూడా కోడిపుంజులను రు.5వేల నుండి రు.50వేల వరకూ ఒక్కో కోడికి వెచ్చించి దిగుమతి చేసుకుంటామని పందెపురాయుళ్లు చెబుతున్నారు. పుంజులకు బలం కోసం గాయమైన చోట గాయాల మాన్పు కోసం విటమిన్ మాత్రలు, ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ఇస్తుండడంతో పుంజులకు ఏరోగాలు సోకకుండా ప్రత్యేక వైద్య చికిత్సలతో శ్రద్ధ‌ వహించి, పందేలకు సిద్ధం చేస్తున్నారు.

ట్రైనింగ్ సెంటర్ ఫీజు పదివేలు..
ఇంతటి ప్రాచుర్యం పొందిన కోడిపందాల్లో పోరాడే కోళ్లకు జిల్లాలో ట్రైనింగ్ సెంటర్లు కూడా విస్తృతంగా వెలిశాయి. ఈ కేంద్రాల్లో ఒక్కో కోడికి రు.8వేల నుంచి రు.10వేలు వరకూ ఛార్జీలు వసూలు చేసి, ఒకేసారి వంద నుంచి 200ల కోళ్ల వరకు ట్రైనింగ్ ఇస్తుండడంతో పందెంరాయుళ్లు ఇక్కడినుండి తయారైన కోళ్లను రు.50 వేల నుండి లక్ష రూపాయల వరకూ వెచ్చించి కొనుగోలు చేస్తుంటారంటే ఆశ్చర్యం కలగకమానదు. ట్రైనర్ తో శిక్షణ పొందిన కోళ్లు బరిలో ఎలాంటి ప్రత్యర్ధినైనా మట్టికరిపిస్తాయని పందెగాళ్ల నమ్మకం. మరోప్రక్క పోలీసులు పందాలపై నిషేధం విధిస్తున్నప్పటికీ యధావిధిగానే భీమవరం, వెంప, అయిభీమవరం, జువ్వలపాలెం, పాలకొల్లు, ఆకివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తణుకు, పరిసర ప్రాంతాల్లో పందాలకు రంగం సిద్ధమౌతోంది. ఏటా సంక్రాంతి నాలుగురోజులు జరిగే తమ సాంప్రదాయ కోడిపందాలకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని సాంప్రదాయ ప్రియులు కోరుకుంటుంటారు

- Advertisement -

దేశ విదేశాల అతిధులకు ఆహ్వానాలు..
సాంప్రదాయాన్ని ప్రభుత్వాలు, పోలీసులు గౌరవించాలని, ఎలాగైనా అనుమతి ఇవ్వాలని గోదావరి జిల్లాల వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్ లు కాయడం వల్ల ఎన్నో కుటుంబాలు అప్పులపాలై, ఆస్థులు అమ్ముకుని ఏటా రోడ్డున పడుతున్నారని మరికొందరు విమర్శించేవారూ లేకపోలేదు. ఇంకొందరైతే తమిళనాడు లో జల్లికట్టు తరహాలో, లేక గుర్రంపందేల తరహాలో ప్రత్యేక అనుమతులు ఇచ్చేయాలంటుండడం విశేషం. ఇక ఈ సంక్రాంతి కోడిపందాలకు, సాంప్రదాయ వేడుకలకు అప్పుడే దేశ, విదేశాల్లోని తమ బంధువులు, స్నేహితులకు ఆహ్వానాలు కూడా పంపేశామని, అందరూ సంతోషంగా వేడుకలు చేసుకోవాలని అంటున్నారు.

కొంత‌మందిపైనే కేసులు..
కోడి పందాల పేరుతో సంవత్సరం పొడుగుతా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కోళ్లను సిద్ధం చేస్తున్న పరిశ్రమలను వదిలేసి కేవలం కోడి కత్తులను తయారుచేసే వృత్తి పని వారిని మాత్రమే వేధించడం వారిపై కేసులు పెట్టి దోషులుగా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగానికి నిజంగా కోడిపందాలను అరికట్టాలని చిత్తశుద్ధి ఉంటే ముందుస్తుగా నెలల తరబడి శిక్షణ ఇస్తూ పరిశ్రమగా వెళ్లి విరుస్తున్న ఈ కోళ్ల పెంపకంపై ఎందుకు చర్యలు తీసుకోరనేది ప్రశ్నార్థకం.. సాంప్రదాయం వినోదం ముసుగులో వేలాది మూగజీవాల ప్రాణాలతో చెలగాటం ఆడి ఆనందించడం మానవత్వానికి మాయని మచ్చ.

Advertisement

తాజా వార్తలు

Advertisement