రాజాం, ఫిబ్రవరి 10 (ప్రభ న్యూస్) : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నారా లోకేష్ శంఖారావం అనే కార్యక్రమం ఆదివారం ప్రారంభిస్తారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు అన్నారు.. శనివారం అయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ… ఆదివారం జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనపై ఈ శంఖారావం లోకేష్ పూరిస్తున్నారని తెలిపారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను చేతిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. యుగగళం అనే సునామీతో జగన్మోహన్ రెడ్డి, వారి అరాచక పాలనపై చెక్కు పెట్టడం జరిగిందని కళా తెలిపారు.
కోరలు లేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయ్యారని వ్యాఖ్యానించారు. సారా నిషేధిస్తాను అన్నారని, ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎలా సిద్దం అంటున్నావ్ అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దీనిపై ప్రజలు ప్రశ్నిస్తారని, ప్రజల తరఫున లోకేష్ ప్రశ్నిస్తారని కళా అన్నారు. కూరగాయలకు, హోటళ్లకు ట్యాక్స్ లకు పేటీఎం ఉందని, ఇసుకకు, మధ్యానికి పేటీఎం ఎందుకు లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ గ్యాంగ్ ను మట్టి కరిపించాలని ఓటు అనే ఆయుధంతో బంగాళాఖాతంలో కలిపేయాలని అయన ప్రజలను కోరారు.