Friday, November 22, 2024

Sankaravam – టీడీపీ, జ‌న‌సేన‌దే సూప‌ర్ సిక్స్! ఆరు ప‌థ‌కాల‌తో ఆదుకుంటాం – నారా లోకేష్

(ఆంధ్రప్రభ స్మార్ట్, నరసన్నపేట ప్రతినిధి) . ఉత్తరాంధ్రాకు పట్టిన శని ఈ సీఎం జగన్.. ఉత్తరాంధ్రలో సాగునీరు లేదు, తాగునీరు లేదు.. పెండింగ్ ప్రాజెక్టుల్లోఒక్క పని కూడా చేపట్టలేదు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శంఖారావం పేరిట ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. రెండో రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సోమవారం శంఖారావం సభ జరిగింది. ఈ సభలో లోకేష్ మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో రోడ్లు నిర్మించాం.. ఆసుపత్రులు నిర్మించాం.. ఉద్దానంలో బాధితులకు డయాలసిస్ స‌దుపాయం కల్పించాం.. కానీ జగన్ ప్ర‌భుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిప‌డ్డారు. నరసన్నపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఒక్కపని కూడా చేపట్టలేదని, ఆయన పేరులోనే ధర్మాన ఉంది.. కానీ ఆయన అధర్మ ప్రభువు అని ధ్వ‌జ‌మెత్తారు.

వాట‌ర్ ప్రాజెక్టులు చేప‌డుతాం..

అంగన్‌వాడీల నియామకం కావొచ్చు.. షిప్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు కావొచ్చు అన్ని అమ్మేసుకున్నారని లోకేష్ ఆరోపించారు. నియోజకవర్గంలో చెరువులు, భూములు వేటినీ వదిలి పెట్టలేదన్నారు. భూకబ్జాలే అధర్మ ఆలోచన అని విమర్శించారు. వంశధార, తోటపల్లి కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేస్తానని, తోటపల్లి కరకట్ట నిర్మిస్తానని తన పాదయాత్రలో జగన్ హ‌మీ ఇచ్చారని.. ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. మరో 60 రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అధికారంలోకి వచ్చిన వెంటనే తోటపల్లి కరకట్టపనులు, బొంతు ఎత్తిపోతల ప్రాజెక్టు చేపడుతామని లోకేష్ హామీ ఇచ్చారు.

మూడు రాజ‌ధానుల పేరుతో మోసం..

మూడు రాజధానుల పేరిట జగన్ మోసం చేశారని, శ్రీకాకుళం జిల్లా ప్రజల అవసరాలను తీర్చలేద‌న్నార‌. కానీ 500 కోట్లతో ప్యాలెస్ క‌ట్టుకున్నారని విమ‌ర్శించారు. షుగర్ ఫ్యాక్టరీలను తెరుస్తామని హామీ ఇచ్చారని, ఒక్క ఫ్యాక్టరీని తెరవలేదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. కానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జగన్ సిద్ధపడ్డారని.. తన ఆస్తులు పెంచుకునేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పారు. అవసరమైతే ఆంధ్రులే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

ఇద్ద‌రికే ఉత్త‌రాంధ్ర ధారాద‌త్తం..

ఉత్తరాంధ్రాను ఇద్దరికి ధారదత్తం చేశారని, ఒకరు విజయసాయి రెడ్డి, మరకొరు ఎస్వీ సుబ్బారెడ్డికి అప్పగిస్తే భూకబ్జాలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆరోపించారు. ఇక జగన్ ప్రజల రక్తం తాగేస్తున్నారని, క్వార్టర్ మందుతాగిన వ్యక్తి నుంచి రూ.25లు జే ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఏటా 45 వేల కోట్ల రూపాయాలను జేబులో వేసుకొంటున్నార‌న్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పడు జేబు ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యం తయారు చేసేది, బాటిల్ నిపేది, అమ్మించేది ఆయనే అన్నారు. వైన్ షాపులకు టార్గెట్ ఇచ్చేది జగనే అని మండిప‌డ్డారు. మరో అరవై రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, బాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని, రైతులకు ఏటా రూ.20వేలు, ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలు వచ్చేవరకూ నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, మహిళలకు ఉచితంగా ఆర్టీసీప్రయాణ సదుపాయం కల్పిస్తామని లోకేష్ హామీలు కుమ్మరించారు. సభలో శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement