కర్నూలు బ్యూరో : కర్నూలు నగరంలోని వీధుల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు కర్నూలు సమీపంలోని జగన్నాథం కట్టపై ఉన్న టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టిజి భరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం టిడ్కో, శానిటేషన్ సంబంధిత అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. కర్నూలు నగరంలోని వీధుల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో శానిటేషన్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రైనేజీలు శుభ్రం చేయడం, చెత్త సేకరణపై చర్చించారు.
ప్రతి రోజూ క్రమం తప్పకుండా కాల్వలు శుభ్రం చేయాలన్నారు. తమ ఫ్యాక్టరీ నుండి ఉచితంగా అందజేస్తున్న హైపో ద్రావణాన్ని తీసుకొని వీధుల్లో పిచికారీ చేయాలని ఆదేశించారు. ఏ రోజు ఎక్కడెక్కడ హైపో ద్రావణం పిచికారీ చేస్తున్నారో రోజువారీ నివేదిక ఇవ్వాలన్నారు.
అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పారిశుధ్య పనులు సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుధ్య విభాగంలో సరైన సిబ్బంది లేకపోవడం, ఆర్థిక వనరుల కొరత ఉందన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడతానని, అవసరం అయితే మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి టి.జి భరత్ తెలిపారు.
కర్నూలు నగర సమీపంలోని జగన్నాథ గట్టుపై 10 వేల టిడ్కో గృహాలు మంజూరైనాయని ఈ గృహాల కొరకు అర్హులైన వారి వివరాలను వార్డువైజుగా లిస్ట్ తయారు చేసి ఇవ్వాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. గృహాలు పూర్తికావడానికి ఇంకా ఎంత నిధులు అవసరమని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
త్వరితగతిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలు గృహాల్లో నివసించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, మున్సిపల్ ఎంహెచ్వో విశ్వేశ్వరరెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.