Saturday, November 23, 2024

సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారుల ఆస్తి: ధూళిపాళ్ల

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇటీవలే బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, ధూళిపాళ్ల నేతృత్వంలో సంగం డెయిరీ పాలకవర్గం శనివారం విజయవాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా డెయిరీ తరఫున పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించాలని తీర్మానించారు. పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు.

ఈ సందర్భంగా సంగం డైయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో పాలకు అత్యధిక ధర చెల్లించి పాడి రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డామన్నారు. సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారుల ఆస్తి అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 5 వేల లీటర్ల కెపాసిటీ ఉన్న బల్క్ కూలర్ నెలకొల్పనున్నామని, కుప్పంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. జూన్ 1 నుంచి కిలో వెన్నకు రూ.710 చెల్లిస్తామని, 10 శాతం వెన్న ఉండే గేదె పాలకు రూ.71.50 చెల్లిస్తామని వివరించారు. పశుదాణా కోసం ఈ ఏడాది 2 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేస్తామని ధూళిపాళ్ల తెలిపారు.

కాగా, సంగం డెయిరీ అక్రమాల కేసులో ఏప్రిల్ 23న ఛైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రతోపాటు ఎండీ గోపాలకృష్ణన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నించారు. మధ్యలో ఏసీబీ కస్టడీ విచారణతో పాటు పలు జైళ్లకు కూడా తిప్పారు. ఆరోగ్యం బాగోలేకపోయినా ఏసీబీ అధికారులు మాత్రం ఆస్పత్రి నుంచి జైలుకు కూడా తరలించారు. దీనిపై గతంలోనే ఏసీబీ కోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. జైల్లో ఉండగానే ధూళిపాళ్ల కరోనా బారినపడ్డారు. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ధూళిపాళ్ల చికిత్స పొందారు. ఇటీవలే సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‎కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడలోనే ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది.

https://twitter.com/DhulipallaNk/status/1398526293407195142
https://twitter.com/DhulipallaNk/status/1398526295160418305
Advertisement

తాజా వార్తలు

Advertisement