Friday, November 22, 2024

శాండల్ వుడ్ కోసం చావు తెలివి.. వీడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..

నెల్లూరు, (ప్రభ న్యూస్‌) : ఒకరి పొలంలో ఉన్న ఎర్రచందనం చెట్లను అనుమతులు లేకుండా నరికి వాటిని వేరొకరి పొలంలో భద్రపరిచి.., గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు ప్ర‌య‌త్నాస్తుండ‌గా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, నెల్లూరు రూరల్‌ పోలీసు అధికారులు సంయుక్తంగా దాడి చేసి రూ.3 లక్షలు విలువ చేసే 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనపరుచుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నెల్లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సూపరిన్‌టెండెంట్‌ రవికుమార్‌, అదనపు సూపరింటెండెంట్‌ కృష్ణకిషోర్‌రెడ్డిలు ఈ ఎర్రచందనం దుంగలకు సంబంధించి వివరాలు వెల్లడించారు. పొదలకూరు మండలం ఉలవపల్లి గ్రామంలో త్రోవగుంట మహేష్‌కు చెందిన పొలంలో రెండు ఎర్రచందనం చెట్లు ఉండడంతో అతని స్నేహితులైన నెల్లూరు రూరల్‌ మండలం ఉప్పుటూరు గ్రామానికి చెందిన అచ్చి శీనయ్య, రాపూరు మండలం గుండవోలు గ్రామానికి చెందిన ఆలకుంట పరంధామయ్య, హైటెక్‌ శ్రీను అనే నలుగురు వ్యక్తులు ఆ చెట్లను నరికి విక్రయిస్తే పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోవచ్చని పథకం వేశారు.

ఇందులో భాగంగానే గత నెల 18వ తేదీ పై నలుగురు వ్యక్తులు ఆ రెండు చెట్లను నరికి 10 దుంగలుగా చేసి నెల్లూరు రూరల్‌ మండలం ఉప్పుటూరు గ్రామంలోని ఆత్మకూరు బుజ్జయ్య అనే వ్యక్తికి చెందిన పొలంలో భద్రపరిచారు. ఆ ఎర్రచందనం దుంగలను బుధవారం తెల్లవారుజామున సదరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని సెబ్‌ జేడీ కె. శ్రీలక్ష్మికి సమాచారం అందడంతో ఆమె ఇచ్చిన ఆదేశాలతొ సెబ్‌ సూపరిన్‌టెండెంట్‌ రవికుమార్‌, ఏఈఎస్‌ కృష్ణకిషోర్‌రెడ్డి, జేడీ టీం ఇన్‌స్పెక్టర్‌ హుస్సేన్‌బాషా, నెల్లూరు రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు బుధవారం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో కాపుకాచారు. శీనయ్య, పరంధామయ్య, మహేష్‌ అనే ముగ్గురు ఆ దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా సెబ్‌, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.3 లక్షలు విలువ చేసే 10 ఎ ర్రచందనం దుంగలను స్వాధీనపరుచుకున్నారు.

వారిని నెల్లూరు రూరల్‌ స్టేషన్‌కు తరలించి విచారించగా ఎర్రచందనం దుంగలను ఎవరికైనా విక్రయించి సొమ్ము చేసుకుందామనే ఉద్దేశ్యంతోనే ఎర్రచందనం చెట్లను నరకడం జరిగిందని విచారణలో వెల్లడించారు. ఈ కేసులో హైటెక్‌ శ్రీను అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సెబ్‌ ఈఎస్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. వెంకటరెడ్డి, ఎస్సైలు బాలకృష్ణ, పాపిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement