రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో దొంగాట మళ్లి మొదలైంది. ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు ప్రభుత్వం తెరమీదకు తీసుకొస్తున్నా.. ఇసుక మాఫియా మాత్రం మరో కొత్త మార్గాన్ని ఎంచుకుని తమ దందాను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఆశయాలకు, ఆదాయానికి తూట్లు పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 రీచ్‌లకు మాత్రమే ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే, 200కుపైగా రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో ఇసుక అక్రమాలు ఏస్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇసుక అక్రమార్కులకు వరదలు కూడా ఓ వరంగా కలిసొచ్చాయి. గతలో ఇసుక దోపిడీ చేసిన ప్రాంతాలను గుర్తించే అవకాశం లేకుండా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా నదులకు వరద పోటెత్తింది. దీంతో ఆరేవుల హద్దులన్నీ కొట్టుకుపోవడం, కొత్తగా ఇసుక మేటలు వేయడంతో అక్రమార్కులకు పండుగలా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో వరదలు తగ్గుముఖం పట్టడం, కృష్ణా, గోదావరి, పెన్నా నదుల్లో నీటి ప్రవాహం కూడా పూర్తిగా తగ్గపోవడంతో తిరిగి తమ దొంగాటను మొదలు పెట్టారు. ప్రస్తుతం పోలీసుల దాడుల్లో భారీ లారీలు పట్టుబడుతున్నాయంటే రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ఏస్థాయిలో జరుగుతుందో స్పష్టంగా అర్ధమౌతోంది.
రాష్ట్రంలో ఏప్రాంతంలోనైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిర్మాణ పనులు జరిగే సందర్భంలో ఆయా నదుల పరిధిలో ఇసుకను ఉచితంగా తీసుకోవచ్చు. ఈనిబంధనను అడ్డం పెట్టుకుని కొంత మంది మాఫియా నిర్మాణాల పేరుతో నిత్యం పెన్నా, కృష్ణా, గోదావరి నదుల నుండి పెద్ద ఎత్తున ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా మండలాల పరిధిలో అధికారులనుండి అనుమతులు తీసుకుని రోజులతరబడి ఇసుకను తవ్వుకుంటున్నారు. వాస్తవానికి నిర్మాణ సామర్ధ్యాన్ని బట్టి ఇసుక యూనిట్లకు అనుమతులివ్వాలి. అలా ఇచ్చిన అనుమతులను సంబంధిత అధికారులు వారానికి ఒకటి రెండు రోజులైనా పరిశీలించాలి. అయితే, ఆదిశగా ఎక్కడా తనిఖీలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కేవలం సెబ్ అధికారులు మాత్రమే దాడులు చేస్తున్నారు. వారి దాడుల్లోనే ఇసుక అక్రమ రవాణా వెలుగులోకి వస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital