Friday, November 22, 2024

వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నవిత్తనాల విక్రయాలు.. కృత్రిమ కొరతతో అధిక ధరలు

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రతీ ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం మిర్చి విత్తన ధరలకు రెక్కలు వచ్చాయి. దళారులపై అధికారుల నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు.. విత్తన కంపెనీలు.. డీలర్లు ఇష్టారాజ్యాంగా విక్రయిస్తున్నారు. కిలో మిర్చి విత్తనాల ధర లక్ష రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. గత మూడేళ్లుగా మిర్చి ధరలు ఆశాజనకంగా వుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం ఏడాదికాఏడాది పెరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని రైతులు కోరుకుంటు-న్న విత్తనాల లభ్యత తక్కువగా ఉందని, కొన్ని లాట్‌లు ఫెయిల్‌ అయ్యాయని చెబుతూ మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న విత్తనాలు తక్కువగా సరఫరా చేస్తూ సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కంపెనీ ప్రతినిధులకు కొందరు విత్తన డీలర్లు ఇతోధికంగా సహకారం అందించడంతో రైతుల జేబుకు చిల్లుపడుతోంది.

రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఇద్దరు లేదా ముగ్గురు విత్తన వ్యాపారులకు మాత్రమే సరఫరా చేస్తూ వారు చెప్పిన ధరకే రైతులు కొనుగోలు చేసేలా చేయడంలో కొందరు సఫలీకృతమవుతున్నారు. దశాబ్దాలుగా విత్తన విక్రయ రంగంలో ఉన్న వ్యాపారులు మిర్చి విత్తన సీజన్‌లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏడాది కాలంగా మిర్చి ధరలు కూడా ఆశాజనకంగా ఉండడంతో రైతు కోరుకున్న విత్తనాల కోసం ఎగబడడం కొందరు వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీనికి తోడు వైరస్‌ను తట్టు-కునే రకాలుగా ప్రచారం చేస్తూ రైతులకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. జూన్‌ నెలలో మిర్చి సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి నుంచే కొన్ని రకాలకు డిమాండ్‌ ఉన్నట్లు- ప్రచారం చేస్తున్నారు. కోరుకున్న విత్తనాలు దొరుకుతాయో.. లేదోనన్న ఆందోళనతో రైతులు అధికధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

రాష్ట్రంలో మిర్చి అధికంగా పండించే గుంటూరు జిల్లాలో 80వేల హెక్టార్ల వరకు మిర్చి సాగవుతోంది. ఇందుకు అనుగుణంగా విత్తన ప్రణాళిక ఉన్నప్పటికీ కొన్ని రకాలకు మాత్రం డిమాండ్‌ మేరకు సరఫరా కావడం లేదు. గుంటూరు జిల్లా బాడిగ, మధ్యస్థ రకం, తేజ రకాలకు చెందిన మూడు కంపెనీల విత్తనాలను రైతులు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఒక కంపెనీ విత్తనాలు సాగు చేస్తే దిగుబడులు బాగున్నా మార్కెట్‌లో ఇతర రకాల కంటే తక్కువ ధరలు పలుకుతున్నాయి. మరో కంపెనీ విత్తనం వైరస్‌ను తట్టుకుంటుందనే ప్రచారంతో రైతులు మొగ్గుచూపుతున్నారు. మరో కంపెనీ విత్తనానికి మార్కెట్‌లో మంచి ధరలు రావడంతోపాటు రైతుకు అనుకూలంగా ఉందన్న ప్రచారంతో ఎక్కువమంది సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విభాగంలోనే పలు కంపెనీలు ఉత్పత్తి చేసి విక్రయాలు చేస్తున్నా రైతులు కొన్ని కంపెనీల విత్తనాల సాగుకు ముందుకొస్తున్నారు. దీంతో సదరు కంపెనీల విత్తనాలకు డిమాండ్‌ పెరిగింది. ఒక కంపెనీ అయితే 10 గ్రాముల విత్తన సంచి ధర రూ.1300 పైగా ఎమ్మార్పీ నిర్ణయించడం గమనార్హం.

- Advertisement -

సంకర విత్తన ధరల నిర్ణయంపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో తయారీదారులు ఏటికేడు గరిష్ఠ చిల్లర ధర విపరీతంగా పెంచేస్తున్నారు. చాలా కంపెనీలు ఎమ్మార్పీ కంటే తక్కువకే విక్రయిస్తున్నా మరికొన్ని మాత్రం కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీని మించి అమ్ముతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిమాండ్‌ ఉన్న విత్తనాలను ఆ కంపెనీలు ఇక్కడికి పూర్తి స్థాయిలో సరఫరా చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసి ఇక్కడ కొరత ఉండేలా చూస్తున్నారు. దీంతో ఇక్కడి వ్యాపారులు అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ నల్లబజారులో అధిక ధరకు విక్రయస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ విధానాన్ని వ్యాపారులు ఎంచుకుని ఎంపిక చేసుకున్న రైతులకే ముందస్తుగా డబ్బులు తీసుకుని తెప్పించి ఇస్తున్నారు. ఇందులో కొందరు కంపెనీ ప్రతినిధులు, విత్తన విక్రయాలను శాసిస్తున్న ఇద్దరు వ్యాపారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇరువర్గాలకు లాభదాయకంగా ఉండడంతో ఈ విధానాన్ని విస్తరిస్తున్నారు. స్థానిక వ్యవసాయాధికారులు ధరల నియంత్రణ చేయడానికి ఇక్కడికి సరఫరా చేసి విక్రయించనందున వారి పర్యవేక్షణలో అమ్మకాలు జరగడం లేదు. ఇదే అదునుగా వ్యాపారులు నిర్ణయించుకున్న ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా విత్తన డిమాండ్‌కు అనుగుణంగా సంబంధిత జిల్లాలకే సరఫరా చేయాలని ఆయా కంపెనీలకు సూచించారు. అయితే డిమాండ్‌ ఉన్న విత్తనాలు ఆ మేరకు జిల్లాలకు సరఫరా కావడం లేదు. ఇందుకు విత్తన పరీక్షల్లో కొన్ని లాట్‌లు ఫెయిల్‌ అయినందున ఈ ఏడాది డిమాండ్‌ మేరకు సరఫరా ఉండదని వ్యాపారులు రైతులను మభ్యపెడుతున్నారు. వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించి కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై నిఘా వేసి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement