శ్రీకాకుళం, ఏప్రిల్ 26 (ప్రభ న్యూస్): పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు కొణిదల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) పీఠాపురం వస్తుంటే ఆయన కోసం సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని, సజ్జల ఓ సన్నాసి అని రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఆరేటి ప్రకాష్‌రెడ్డి అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కాపులను తీవ్ర అన్యాయం చేస్తూ కాపులకు ఆర్థిక, ఉపాధి అవకాశాల్లో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఆర్ ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాపు కార్పొరేషన్‌ను, రిజర్వేషన్లను సైతం భ్రష్టు పట్టించారన్నారు. అభివృద్ధిలో, సంక్షేమంలో రాష్ట్రం అధోః పాతాళానికి పడి పోయిందన్నారు. వ్యవస్థల పనితీరులోనూ, ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టించిన ఘనత సీఎం జగన్‌మోహనరెడ్డికి దక్కుతుందన్నారు. మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా ఆవిష్కరించబడిందని, కూటమిలో భాగంగా బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయగల చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాల భావజాలం కలిగిన పవన్‌కళ్యాణ్, దేశ ప్రగతిని పరుగులు పెట్టించగల సత్తా కలిగిన నరేంద్రమోడీలు కలసి చేస్తున్న ఈ పోరాటం చారిత్రాత్మకమైనదని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని ప్రజలంతా భావిస్తున్నారని పేర్కొన్నారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూమి కూడా మనది కాకుండా లాగేసుకునేందుకు ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాస్, టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణరావు, పాండ్రంకి శంకర్, పెద్ది కవిత, తదితరులు పాల్గొన్నారు.