Tuesday, November 26, 2024

అసెంబ్లీలో టైం పాస్ రాజకీయాలు: శైలజానాథ్

వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్. తుఫానుతో కడప జిల్లా రాజంపేట, నందలూరులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పించా డ్యామ్ తెగిపోతూనే జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించి ఉంటే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేది కాదన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కూర్చుని మానిటర్ చేయడం హేయనియమని మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి విపత్తులను గత ప్రభుత్వాలు ధీటుగా ఎదుర్కొన్నాయని గుర్తు చేశారు. ప్రకృతి విపత్తుకు ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని కొంత మంది మంత్రులు మాట్లాడటం తగదన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి వెలకట్టలేమన్న శైలజానాథ్.. అసెంబ్లీలో కూర్చుని బుతులు మాట్లాడుకునే మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల కష్టాలు పట్టవా? అని ప్రశ్నించారు.

కేంద్రం పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. పరిపాలన అంటే ఇంట్లో నుంచి పాలన చేయడం కాదని పేర్కొన్నారు. గాల్లో తిరుగుతున్న సీఎంకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని శైలజానాథ్ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేయాలన్నారు. గల్లంతైన మృతదేహాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. మళ్ళీ తుఫాను హెచ్చరికలు ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీలో టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దశాబ్దాల కాలం వైసీపీ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో గుంతలు పూడ్చలేరని ఎద్దేవా చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement