కర్నూలు బ్యూరో : కర్నూలు జిల్లాలోని సుంకేసుల డ్యాం వద్ద తెలంగాణ వైపు మట్టి కరకట్ట కొద్దిగా కుంగింది. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వీటిని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు మట్టి కట్ట కుంగిన ప్రాంతంలో తక్షణ చర్యలకు ఉపక్రమించారు.
ఆయా ప్రాంతంలో ఇసుక మూటలను నింపడంలో నిమగ్నమయ్యారు. సుంకేసుల బ్యారేజ్ మట్టికట్ట ఏమాత్రం తెగిన కర్నూల్ నగరంలోని తుంగభద్ర సమీప కాలనీలతో పాటు సుంకేసుల బ్యారేజ్ చుట్టుపక్క గ్రామాలు నీటి మునిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటికట్ట కుంగిందని తెలియడంతో కర్నూలు ప్రజలు ఆందోళనలో పడ్డారు.
ఇక బ్యారేజ్ కి సమీపంలోని సుంకేసుల, దిగువనున్న ఎదురూరు, నిజ్జూరు, మామిదులపాడు, మునగాలపాడు ప్రజలు ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు.
ఇంతగా ఆందోళన చెందేందుకు కారణం గతంలో వచ్చిన వరదలే. 2009లో వచ్చిన వరదల కారణంగా సుంకేసుల బ్యారేజ్ పూర్తిగా పోయి కేవలం స్పిల్ వే గేట్ల కాంక్రీట్ కట్టడాలు మాత్రమే మిగిలాయి. అయితే వరదల తర్వాత స్థానిక ప్రజలు, ప్రభుత్వంతో కలిసి సుంకేసుల బ్యారేజ్ కరగట్టలను తిరిగి పునర్దించారు.
ఆ తర్వాత బ్యారేజ్ కి సంబంధించి శాశ్విత నిర్మాణాలు చేయలేదు.. 2009 వరదల తర్వాత స్థానికుల సహకారంతో ఏర్పాటుచేసిన కరకట్టలనే కొనసాగిస్తున్నారు. సుంకేసుల బ్యారేజ్ పరిధిలో కరకట్టల ఎత్తు పెంపుతో పాటు ఇతర నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాలకి నివేదించిన ఫలితం లేకపోయింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడం, ఇదే సమయంలో తుంగభద్రకు భారీగా వరదలు రావడం, సుంకేసుల బ్యారేజ్ కి వరద నీరు పోటెత్తితూ శ్రీశైలం చేరుతుంది. ఈ క్రమంలో తెలంగాణ పరిధిలో సుంకేసుల కరకట్ట కొద్దిగా కుంగడం స్థానికులను కలవరం కు గురిచేసింది.
ఆందోళన చెందాల్సిన పనిలేదు-మంత్రి టీజీ భరత్
తెలంగాణ వైపు సుంకేసుల కరకట్ట కొద్దిగా కుంగడంపై ఆందోళన చెందొద్దని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. సుంకేసుల డ్యాం వద్ద కుంగిన మట్టి కరకట్టను పూడ్చేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సుంకేసుల డ్యాం భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రజలకు సహాయ చర్యలు అందించడంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు.